ప్రేమ, పెళ్లి అంటే ఏంటో తెలియని వయసులోనే కొందరు ఆ ఉచ్చులో పడి.. నూరేళ్ల జీవితాన్ని నాశనం చేసుకుంటున్న సంఘటనలు ఇటీవల ఎక్కువగా జరగడం మనం చూస్తూనే ఉన్నాం. ఇక ఆ వయసులో ప్రేమించిన వారి మాయలో పడి.. సొంతవారిని సైతం పట్టించుకోకుండా ఉన్నవారు కూడా ఉన్నారు. అయితే ఓ బాలిక మాత్రం అంతకుమించిన పని చేసింది. 14 ఏళ్లకే ఓ యువకుడిని ప్రేమించింది. అంతేకాకుండా అదే వయసులో అతడితో లేచిపోయింది. అది తెలిసిన బాలిక తండ్రి.. ఆ యువకుడిపై పోక్సో కేసు పెట్టి.. బాలికను తిరిగి తీసుకువచ్చారు. దీంతో తండ్రిపై కక్ష పెంచుకున్న ఆ యువతి తండ్రితోపాటు 9 ఏళ్ల తమ్ముడిని అతి కిరాతకంగా హత్య చేసింది. ఘటన తర్వాత పారిపోయిన బాలిక.. ఎట్టకేలకు రెండున్నర నెలల తర్వాత పోలీసులకు చిక్కింది.
మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఈ దారుణ సంఘటన చోటు చేసుకుంది. మార్చి 15 వ తేదీన.. సివిల్ లైన్స్ ఏరియాలోని మిలీనియం సొసైటీకి చెందిన ఓ బాలిక.. తండ్రితోపాటు, 9 ఏళ్ల తమ్ముడిని అతి కిరాతకంగా చంపేసింది. తాజాగా ఆ బాలిక హరిద్వార్ పోలీసుల కంట పడటంతో అరెస్ట్ చేశారు. అయితే ఆ బాలిక.. 19 ఏళ్ల ముకుల్ సింగ్ అనే యువకుడితో గతేడాది సెప్టెంబర్‌లో లేచిపోయింది. దీంతో మైనర్‌ను లేపుకెళ్లాడని అప్పట్లో బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. రంగంలోకి దిగిన పోలీసులు.. ఎట్టకేలకు వారిని గుర్తించారు. వెంటనే బాలికను తీసుకెళ్లినందుకు ముకుల్ సింగ్‌పై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. అతడ్ని అరెస్ట్ చేశారు. తర్వాత బాలికను తండ్రికి అప్పగించారు. అయితే ఈ కేసులో బెయిల్ పొందిన ముకుల్ సింగ్ బయటికి వచ్చాడు.
అయితే తన ప్రియుడు ముకుల్ సింగ్‌పై పోక్సో కేసు పెట్టి తన తండ్రి అరెస్ట్ చేయించాడని.. ఆ బాలిక కోపం పెంచుకుంది. ఈ క్రమంలోనే తమ ప్రేమను ఒప్పుకోని ఆ తండ్రిని హతమార్చాలని నిర్ణయం తీసుకుంది. దీనికి బాలిక, ముకుల్ సింగ్ ప్లాన్ వేశారు. ఈ క్రమంలోనే తండ్రితోపాటు లోకం తెలియని 9 ఏళ్ల తముడ్ని కూడా అతి దారుణంగా ఇద్దరూ కలిసి హత్య చేశారు. వారిద్దరినీ చంపిన తర్వాత శవాలను ఫ్రిజ్‌లో ఉంచారు. అనంతరం మృతదేహాలను ముక్కలు ముక్కలుగా కోసి అక్కడి నుంచి పరారయ్యారు.
విషయం తెలుసుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. బాలికే తన ప్రియుడితో కలిసి తండ్రిని, తమ్ముడిని హతమార్చిందని గుర్తించారు. ఈ క్రమంలోనే వారిద్దరి కోసం గాలింపు చేపట్టారు. మార్చి 15 వ తేదీన హత్య జరగ్గా.. తాజాగా హరిద్వార్ పోలీసులు ఆ బాలికను అరెస్ట్ చేశారు. ఇక ముకుల్ సింగ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.