డోన్ అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ జెండా రెపరెపలాడింది. టీడీపీ కూటమి అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి సంచలన విజయం సాధించారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డిపై టీడీపీ అభ్యర్థి కోట్ల ప్రకాష్‌రెడ్డి 6,049 ఓట్లతో గెలుపొందారు. 2024సార్వత్రిక ఎన్నికల్లో డోన్ అసెంబ్లీ కూటమి అభ్యర్థిగా కోట్ల ప్రకాష్‌రెడ్డి పోటీ చేయగా, వైసీపీ నుంచి మంత్రి బుగ్గన పోటీ చేశారు. కాంగ్రేస్ అభ్యర్థిగా డాక్టర్ గార్లపాటి మద్దిలేటితో పాటు మరో 13మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీలో నిలిచారు. మంగళవారం నంద్యాల సమీపంలోని ఆర్జీఎం ఫార్మసీ కళాశాలలో ఎన్నికల అధికారి మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో డోన్ అసెంబ్లీ ఓట్లను లెక్కించారు. 6,049 మోజారిటీతో కోట్ల గెలుపు. డోన్ అసెంబ్లీ నియోజక వర్గంలోని 291 పోలింగ్ కేంద్రాలలో మొత్తం 1,88,187 ఓట్లు పోలయ్యాయి. ఇందులో టీడీపీ అభ్యర్థి కోట్ల ప్రకాష్‌రెడ్డికి 92,421 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి రాజారెడ్డికి 86,690 ఓట్లు వచ్చాయి. దీంతో కూటమి అభ్యర్థికి 5,731 ఓట్ల మెజారిటీ లభించింది. పోస్టల్ బ్యాలెట్ల ద్వారా 2,158 ఓట్లు పోలు కాగా..1936 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అర్హత పొందాయి. ఇందులో టీడీపీకి 1,102 ఓట్లు రాగా, వైసీపీకి 784 ఓట్లు వచ్చాయి. 222 ఓట్లు తిరస్కరణకు గురికాగా, నోటాకు 11 పోస్టల్ బ్యాలెట్లు వేశారు. పోస్టల్ బ్యాలెట్లలో టీడీపీ అభ్యర్థి కోట్లకు 318 ఓట్ల మెజారిటీ వచ్చింది. దీంతో డోన్ అసెంబ్లీ నుంచి కూటమి అభ్యర్థి కోట్ల ప్రకాష్‌రెడ్డి 6,049 ఓట్ల మెజారిటీతో బుగ్గనపై గెలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి గార్లపాటి మద్దిలేటికి 3,961 ఓట్లు రాగా, నోటాకు 1362 ఓట్లు వచ్చాయి.