కూటమి అధికారంలోకి రావడంతో దివ్యాంగుల్లో జోష్ నెలకొంది. ఇప్పటివరకు నెలకు రూ.3వేలు మాత్రమే పెన్షన్ అందుకుంటున్నారు. వచ్చే నెల నుంచి రూ.6 వేలు అందనున్నాయి. ఎన్నికల హామీలో భాగంగా జూలైలో ఒక్కొక్క లబ్ధిదారుడికి పెండింగ్ బకాయితో కలిపి రూ.15వేలు పెన్షన్ రానుంది. దివ్యాంగులకు ఇతర లబ్ధిదారుల కంటే ఎక్కువ మొత్తంలో పెన్షన్ ఇచ్చిన ఘనత టీడీపీకే దక్కింది. ఉమ్మడి రాష్ట్రంలో రూ.1000 ఉండేది. దాన్ని రాష్ట్ర విభజన తరువాత రూ.2 వేలకు పెంచారు. గత ఎన్నికల్లో భాగంగా టీడీపీతో పాటు వైసీపీ అధికారంలోకి వస్తే రూ.3వేలు పింఛన్ ఇస్తామన్నారు. దానికి అనుగుణంగా వైసీపీ పెంచి ఐదేళ్లపాటు ఇచ్చింది. ఎన్నికల హామీలో భాగంగా దివ్యాంగులకు వైసీపీ ప్రస్తుత పింఛన్ కొనసాగిస్తామన్నది. కూటమి మాత్రం రూ.6వేలు ఇస్తామని, ఆ మొత్తాన్ని ఏప్రిల్ నుంచే కలిపి ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే ఏప్రిల్ నుంచి జూన్ వరకు ప్రభుత్వం రూ.మూడు వేలు చొప్పున అందించింది. హామీలో భాగంగా ఏప్రిల్, మే, జూన్ మూడు నెలల బకాయి రూ.9 వేలతో పాటు జూలై పింఛన్ రూ.6వేలు మొత్తం రూ.15 వేలు అందించనున్నారు.