సార్వత్రిక ఎన్నికల ఫలితాల వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలిన సంగతి తెలిసిందే. జూన్ 4వ తేదీన బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 6000 పాయింట్ల మేర పడిపోయి మదుపరుల సంపద రూ.20 లక్షల కోట్లు కోసుకుపోయింది. అయితే, మరోసారి ఎన్డీయే కూటమి అధికారం చేపట్టనున్నట్లు స్పష్టమవడంతో ఆ మరుసటి రోజు నుంచే మార్కెట్లు పుంజుకున్నాయి. నిఫ్టీ 10 శాతానికిపైగా పెరిగింది. ఇది స్టాక్ మార్కెట్ల కథ. అయితే ఫలితాలకు ముడిపడిన మరో సెగ్మెంట్ ఉంది. అదే రియల్ ఎస్టేట్. అందులోనూ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలతో ఎక్కువ లాభపడిన నగరం అమరావతి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నగరం అయిన అమరావతి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. గుంటూరు జిల్లాలోని కృష్ణా నది ఒడ్డున నిర్మితమవుతున్న ఈ నగరం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయింది.
జూన్ 4వ తేదీన వెలువడిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తెలుగు దేశం పార్టీ నేతృత్వంలోని కూటమికి అధికారం కట్టబెట్టారు ఏపీ ప్రజలు. 175 సీట్లలో ఏకంగా 164 సీట్లు ఇచ్చారు. దీంతో మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. ఆయన మరోసారి ముఖ్యమంత్రి అవుతున్న క్రమంలో అమరావతి నగరంలో రియల్ ఎస్టేట్ ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. ఫలితాలు వెలువడిన మూడు రోజుల్లోనే అక్కడి భూములు, ఇతర స్థిరాస్తుల ధరలు ఏకంగా 100 శాతానికిపైగా పెరగడం గమనార్హం.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారాన్ని చేజిక్కించుకుంది. అలాగే టీడీపీకి 16 లోక్ సభ స్థానాలు వచ్చాయి. దీంతో కేంద్ర రాజకీయాల్లో బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రాటిక్ అలయన్స్ (NDA) భాగస్వామ్య పక్షాల్లో కీలకంగా టీడీపీ మారిపోయింది. మరోవైపు.. 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడడం, సీఎం జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల అంశం తెరపైకి తేవడంతో అమరావతిలో రియల్ ఎస్టేట్ ఒక్కసారిగా పడిపోయింది. టీడీపీ ప్రభుత్వం మొదలు పెట్టిన అక్కడి వివిధ ప్రాజెక్టుల నిర్మాణాలు ఆగిపోయాయి. 5 ఏళ్ల పాటు పెట్టుబడులు దాదాపు రాలేదనే చెప్పాలి. అయితే ఇప్పుడు టీడీపీ మళ్లీ అధికారంలోకి రావడంతో అమరావతికి పునరుజ్జీవనం వచ్చినట్లయింది. చంద్రబాబు నాయుడు కలల ప్రాజెక్టు కావడంతో అక్కడి నిర్మాణాల్లో మళ్లీ కదలిక మొదలైంది.
ఎన్నికల ఫలితాలు వెలువడిన కేవలం మూడు రోజుల్లోనే అమరావతి నగర పరిధిలో స్థిరాస్తుల ధరలు 50 శాతం నుంచి 100 శాతం మేర పెరిగినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా ఓ కథను ప్రచురించింది. అలాగే గత వారంలో భూముల ధరలు రెండింతలయ్యాయి. ఇప్పటికే ఉన్న ప్రాజెక్టుల్లో ధరలు 10- 20 శాతం మేర పెంచారు. ఆంధ్రప్రదేశ్‌పై చంద్రబాబు నాయుడు దృష్టి కేవలం అమరావతిని కొత్త రాజధానిగా పేర్కొనడమే కాదు దాని స్థాయిని విస్తరించింది. అత్యాధునిక మౌలిక సదుపాయాలు, అభివృద్ధితో ఆ నగరాన్ని ఆధునిక ఐటీ హబ్‌గా మార్చాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన మరోసారి ముఖ్యమంత్రి కాబోతున్న తరుణంలో రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త ఊపు తెచ్చింది.