2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం నుంచి వైసీపీ నేతలు ఇంకా తేరుకోలేకపోతున్నారు. ఓటమికి గల కారణాలను అన్వేషించే పనిలో పడ్డారు. అయితే ఈ రేంజులో ప్రజాతీర్పు ఉంటుందని ఊహించని వైసీపీ లీడర్లు.. ఓటరు తీర్పుపై భావోద్వేగానికి గురౌతున్నారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి, వైసీపీ నేత సీదిరి అప్పలరాజుపై విలేకర్లతో మాట్లాడుతూ ఉద్వేగానికి గురయ్యారు. అసలు మేము చేసిన తప్పేంటీ.. ఎందుకింత ఘోరంగా ఓడించారంటూ కంటతడి పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
"ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుంచి చూస్తే.. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అనిపిస్తుంది. రాష్ట్ర ప్రజలను అడుగుతున్నా. మా నాయకుడిని ఓడించారు. మమ్మల్ని అందరినీ ఓడించారు. అసలు మేము చేసిన తప్పేంటని అడుగుతున్నా. మీకు మంచే కదా చేశాం. ప్రతి ఇంటికీ మంచే కదా చేశాం. రాజకీయాలకు, వర్గాలకు అతీతంగా మంచి చేశాం. మంచి చేశామనే కదా ఓట్లు అడిగాం. కానీ ఎందుకో ఇంత ఘోరంగా ఓడించారు" అంటూ సీదిరి అప్పలరాజు ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా పలాస అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సీదిరి అప్పలరాజు వైసీపీ అభ్యర్థిగా పోటీచేశారు. అయితే టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన గౌతు శిరీష.. అప్పలరాజు మీద విజయం సాధించారు. సీదిరి అప్పలరాజుకు 61, 210 ఓట్లు రాగా.. టీడీపీ అభ్యర్థి గౌతు శిరీషకు 1,01,560 ఓట్లు వచ్చాయి. దీంతో 40350 ఓట్ల మెజారిటీతో గౌతు శిరీష గెలుపొందారు. పోలైన ఓట్లలో 36 శాతం సీదిరి అప్పలరాజుకు పడగా.. 60 శాతం ఓట్లను గౌతు శిరీష సొంతం చేసుకున్నారు.
ఈ నేపథ్యంలో ఈ రేంజులో ఓటమిని అంచనా వేయని సీదిరి అప్పలరాజు.. ఓటమిపై ఉద్వేగానికి లోనయ్యారు. సంక్షేమ పథకాల పేరిట ప్రజలకు మంచి చేసినా.. ఎందుకో తమను తిరస్కరించారని ఆవేదన వ్యక్తం చేశారు. జరిగిన తప్పులను విశ్లేషణ చేసుకుంటామని.. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ఉంటామని చెబుతున్నారు.