దేశంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఇక నరేంద్ర మోదీ మంత్రివర్గంలో ఏపీకి చెందిన టీడీపీ, బీజేపీ ఎంపీలకు మంత్రిపదవులు దక్కనున్నాయి. టీడీపీ నుంచి శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ పేర్లు ఖరారయ్యాయి. అటు బీజేపీ నంచి నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాసవర్మను కేంద్ర మంత్రి పదవి వరించనుంది. అయితే మోదీ నేతృత్వంలో ఏర్పాటయ్యే మంత్రివర్గంలో అత్యంత ధనవంతుడైన మంత్రిగా తెలుగురాష్ట్రాలకు చెందిన ఎంపీ నిలవనున్నారు.
ప్రమాణ స్వీకారం తర్వాత.. గుంటూరు లోక్ సభ నియోజకవర్గం ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్.. ధనవంతుడైన కేంద్ర మంత్రిగా నిలవనున్నారు. గుంటూరు ఎంపీ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్‌కు సహాయ మంత్రి పదవి దక్కనున్నట్లు సమాచారం. బుర్రిపాలెనికి చెందిన పెమ్మసాని చంద్రశేఖర్ ప్రవాసాంధ్రుడు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో గుంటూరు లోక్ సభ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ పోటీ చేశారు. వైసీపీ అభ్యర్థి కిలారి వెంకట రోశయ్యపై 3,44,695 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు.
పెమ్మసాని చంద్రశేఖర్ 1993-94 ఎంసెట్ పరీక్షల్లో మెడిసిన్‌లో 27వ ర్యాంక్ సాధించారు. హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మెడిసిన్ పూర్తి చేశారు. అనంతరం పైచదువుల కోసం అమెరికాకు వెళ్లారు. అక్కడే మాస్టర్స్ పూర్తి చేసి ఫ్యాకల్టీగా స్థిరపడిపోయారు.యూవరల్డ్ పేరుతో అమెరికాలో ఆన్ లైన్ ఎడ్యూటెక్ కంపెనీని నడుపుతున్నారు. అయితే సొంత రాష్ట్రానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఎన్నికల బరిలో నిలిచి గెలిచారు పెమ్మసాని. ఇక ఎన్నికల సమయంలో తన కుటుంబానికి రూ.5,785. 28 కోట్ల ఆస్తి ఉన్నట్లు అఫిడవిట్లో పెమ్మసాని వెల్లడించారు. రూ.5,598.65 కోట్ల విలువైన చరాస్తులు, రూ.186.63 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు తెలిపారు. ఇక అప్పులు కూడా రూ.1,038 కోట్లు ఉన్నట్లు తెలిపారు.
దీంతో మోదీ 3.0 ప్రభుత్వంలో పెమ్మసాని చంద్రశేఖర్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే.. మంత్రివర్గంలోని రిచెస్ట్ మంత్రి ఆయనే కానున్నారు. మరోవైపు గుంటూరు ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్ రాజకీయాల నుంచి తప్పుకోవటంతో.. పెమ్మసానికి గుంటూరు ఎంపీగా పోటీచేసే అవకాశం దక్కింది. తొలిసారి పోటీచేస్తూ ఎంపీగా గెలుపొందారు. ఇప్పుడేమో ఏకంగా కేంద్రమంత్రి పదవి వరిస్తోందని టీడీపీ శ్రేణులు సంబరపడుతున్నాయి.