శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు.. అరుదైన ఘనత అందుకోనున్నారు. నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్రంలో మంత్రివర్గం కొలువుదీరనుండగా.. టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు. పెమ్మసాని చంద్రశేఖర్‌కు మంత్రివర్గంలో చోటు దక్కనుంది. ఇక శ్రీకాకుళం లోక్ సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా హ్యాట్రిక్ కొట్టిన రామ్మోహన్ నాయుడికి మోదీ టీమ్‌లో కేబినెట్ మంత్రి పదవి దక్కినట్లు తెలుస్తోంది. దీంతో యంగెస్ట్ కేబినెట్ మినిస్టర్‌గా రామ్మోహన్ నాయుడు అరుదైన రికార్డు నెలకొల్పనున్నారు. మరోవైపు మేఘాలయకు చెందిన అగతా సంఘ్మా గతంలో 29 ఏళ్ల వయసులో కేంద్ర మంత్రిగా పనిచేశారు. అయితే ఆమె గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. రామ్మోహన్ నాయుడికి మాత్రం కేబినెట్ బెర్త్ దక్కనున్నట్లు తెలిసింది.
కింజరాపు రామ్మోహన్ నాయుడు వయసు 36 ఏళ్లు కాగా.. 2014 నుంచి ఆయన శ్రీకాకుళం నుంచి ఎంపీగా గెలుపొందుతూ వస్తున్నారు. కింజరాపు ఎర్రన్నాయుడు వారసుడిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రామ్మోహన్ నాయుడు.. శ్రీకాకుళం నుంచి హ్యాట్రిక్ కొట్టారు. అయితే ఎర్రన్నాయుడు కూడా గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు 1996లో కేంద్ర మంత్రిగా పనిచేసిన ఎర్రన్నాయుడు.. పిన్నవయస్కుడైన కేబినెట్ మంత్రిగా అప్పట్లో రికార్డు సృష్టించారు. ఎర్రన్నాయుడు రాజకీయ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన రామ్మోహన్ నాయుడు.. తండ్రి తరహాలోనే యంగెస్ట్ మినిస్టర్‌గా ఘనత సాధించనున్నారు.
రామ్మోహన్ నాయుడికి కేబినెట్ బెర్తు దక్కితే.. ఇప్పటి వరకూ కేబినెట్ మంత్రులుగా పనిచేసిన వారిలో అతి పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పుతారు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన రామ్మోహన్ నాయుడు.. లాంగ్ ఐలాండ్ యూనివర్సిటీలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ పూర్తి చేశారు. అయితే 2012లో తండ్రి కింజరాపు ఎర్రన్నాయుడు రోడ్డు ప్రమాదంలో అనూహ్యంగా చనిపోవటంతో రాజకీయాల్లోకి వచ్చారు రామ్మోహన్ నాయుడు. రెండేళ్లలోనే 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో శ్రీకాకుళం నుంచి ఎంపీగా గెలుపొందారు. 26 ఏళ్ల వయసులో ఎంపీగా గెలిచిన రామ్మోహన్ నాయుడు.. 16వ లోక్ సభలో పిన్న వయస్కులైన ఎంపీలలో రెండో వారిగా నిలిచారు.
మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ కేసులో అరెస్టైన సమయంలో రామ్మోహన్ నాయుడు కీలకంగా వ్యవహరించారు. ఢిల్లీలో నారా లోకేష్‌తో కలిసి కీలకంగా వ్యవహరించారు. వీటితో పాటుగా ఎంపీగా పలు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలలో సభ్యుడిగా రామ్మోహన్ నాయుడు పనిచేశారు. 2020లో లోక్ సభలో అతని ప్రదర్శనకు గానూ.. సంసద్ రత్న అవార్డుతో సత్కరించారు.