కేంద్రంలో ఎన్డీయే 3.0 ప్రభుత్వ కొలువుదీరబోతోంది. ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో మోదీతో పాటు ఆయన క్యాబినెట్ మంత్రులు రాష్ట్రపతి భవన్‌లో నేటి సాయంత్రం (జూన్ 9న) ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రస్తుతానికి మోదీ టీంలోకి 30 మందిని తీసుకుటున్నారు.
మోదీ కేబినెట్‌లో తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి చోటు దక్కింది. వీరిలో ఇద్దరు తెలంగాణ, ముగ్గురు ఆంధ్రప్రదేశ్ ఎంపీలు ఉన్నారు. టీడీపీ ఎంపీలు కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌లకు బెర్తులు ఖరారు కాగా.. అనూహ్యంగా నరసాపురం బీజేపీ ఎంపీని కేంద్ర మంత్రి పదవి వరించింది. నరసాపురం నుంచి పోటీచేసి తొలిసారి విజయం సాధించిన భూపతిరాజు శ్రీనివాసవర్మ జాక్‌పాట్ కొట్టారు. ఆయనను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి గూడూరు ఉమాబాలపై 2.79 లక్షల ఓట్లకుపైగా మెజార్టీతో వర్మ గెలుపొందారు.
శ్రీనివాస వర్మకు కేంద్ర మంత్రి పదవే కాదు.. లోక్ సభ ఎన్నికల్లో టిక్కెట్ కూడా అనూహ్యంగా దక్కింది. బీజేపీ అభ్యర్ధిగా రఘురామకృష్ణరాజు పేరు బలంగా వినిపించింది. కానీ, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అనూహ్యంగా శ్రీనివాస వర్మ పేరు చివర్లో తెర మీదకు వచ్చింది. 2014 లోక్ సభ ఎన్నికల్లోనూ బీజేపీ, టీడీపీ పొత్తు పెట్టుకోగా.. అప్పుడు కూడా నరసాపురం లోక్ సభ స్థానాన్ని బీజేపీకి కేటాయించారు. ఆ ఎన్నికల్లో గోకరాజు గంగరాజు నరసాపురం ఎంపీగా గెలుపొందారు. 1999 ఎన్నికల్లో సినీ నటుడు కృష్ణంరాజు సైతం బీజేపీ తరఫునే నరసాపురం ఎంపీగా గెలిచారు.
బీజేపీ వర్మగా గుర్తింపు..
భీమవరానికి చెందిన భూపతిరాజు శ్రీనివాస వర్మ బీజేపీ వర్మగా గుర్తింపు పొందారు. చాలా సంవత్సరాలుగా ఆయన బీజేపీలో కొనసాగడంతో ఆ పేరు వచ్చింది. మున్సిపల్ కౌన్సిలర్‌గా, డీఎన్‌ఆర్ విద్యా సంస్థల జాయింట్ సెక్రెటరీ, కరస్పాండెంట్‌గా, భూపతిరాజు బాపిరాజు ఎడ్యుకేషనల్ సొసైటీ ఛైర్మన్‌గా ఆయన వ్యవహరించారు. 1980ల్లో కమ్యూనిస్ట్ విద్యార్థి సంఘం ఏఐఎస్‌ఎఫ్‌లో ఆయన పని చేశారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం.. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడారు.
తర్వాత బీజేపీ విధానాలకు ఆకర్షితులైన వర్మ కమలం పార్టీలో చేరారు. 1991-1997 మధ్య బీజేపీ భీమవరం టౌన్, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిగా ఆయన పని చేశారు. తర్వాత జిల్లా కార్యదర్శిగా, నరసాపురం పార్లమెంట్ కన్వీనర్‌గా, జాతీయ కౌన్సిల్ మెంబర్‌గా వ్యవహరించారు. 2020-23 మధ్య బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగానూ వ్యవహరించారు. 2009 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున నరసాపురం నుంచి పోటీ చేసిన శ్రీనివాస వర్మ ఓటమి పాలయ్యారు. పీజీ చదివిన శ్రీనివాస వర్మ.. 1967 ఆగస్టు 4న భీమవరంలో జన్మించారు. తల్లిదండ్రులు సూర్యనారాయణ రాజు, సీతాలక్ష్మి.. భార్య వెంకటేశ్వరీ దేవి.