దేశంలో వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్-యూజీ పరీక్ష- 2024 లో తీవ్ర అవకతవకలు జరిగాయని ఆరోపణలు రావడంతో కేంద్ర విద్యాశాఖ చర్యలు చేపట్టింది. నీట్- యూజీ పరీక్ష నిర్వహణలో అక్రమాలు జరిగాయని.. దేశంలోని ప్రతిపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్న వేళ కేంద్రం.. కీలక నిర్ణయం తీసుకుంది. యూపీఎస్సీ మాజీ ఛైర్మన్ నేతృత్వంలో నలుగురు సభ్యులతో కమిటీ వేయాలని కేంద్ర విద్యా శాఖ శనివారం నిర్ణయం తీసుకుంది. ఆ కమిటీ విచారణ జరిపి.. వారం రోజుల్లో సిఫార్సులతో నివేదిక ఇస్తుందని.. నీట్-యూజీ పరీక్ష నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ-ఎన్‌టీఏ డీజీ సుబోధ్ కుమార్ సింగ్ తాజాగా మీడియాకు వెల్లడించారు.
అయితే ఇటీవల ఫలితాలు వెల్లడైన నీట్ - యూజీ పరీక్ష 2024 లో ఏకంగా 67 మందికి ఫస్ట్ ర్యాంక్ రావడంపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరీక్ష నిర్వహణలో లోపాలు ఉన్నాయనే విమర్శలు కోకొల్లలుగా వచ్చాయి. ఈ నేపథ్యంలోనే యూపీఎస్సీ మాజీ ఛైర్మన్ సారథ్యంలోని నలుగురు సభ్యుల కమిటీ.. దీనిపై సమగ్ర విచారణ జరిపి.. వారం రోజుల్లో రిపోర్ట్ ఇవ్వనుందని అధికారులు పేర్కొన్నారు. 1500 మందికి పైగా అభ్యర్థులకు ఇచ్చిన గ్రేస్ మార్కుల్ని ఆ కమిటీ సమీక్షిస్తుందని చెప్పారు. ఆ తర్వాత వారి రిజల్ట్‌ను సవరించే అవకాశం ఉంటుందని తెలిపారు.
అయితే గ్రేస్ మార్కులు ఇవ్వడం వల్ల పరీక్ష అర్హతా ప్రమాణాలపై ఎలాంటి ప్రభావం ఉండదని సుబోధ్ కుమార్ సింగ్ స్పష్టం చేశారు. ఆ అభ్యర్థుల ఫలితాల్ని సమీక్షించినంత మాత్రాన.. ప్రవేశాల ప్రక్రియపై ఎలాంటి ప్రభావం పడదని పేర్కొన్నారు. నీట్ పరీక్షలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలను ఖండించిన సుబోధ్ కుమార్ సింగ్.. నీట్ యూజీ పేపర్ లీక్ కాలేదని.. ఎలాంటి అవకతవకలు జరగలేదని తెలిపారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ నీట్ యూజీ పరీక్ష సమగ్రతకు ఎలాంటి భంగం వాటిల్లలేదని స్పష్టం చేశారు. ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాల్లో మార్పులు, పరీక్ష కేంద్రాల వద్ద సమయం కోల్పోవడంతో ఇచ్చిన గ్రేస్ మార్కులే ఆ విద్యార్థులు అధిక మార్కులు సాధించడానికి కారణాలు అని వివరించారు. అయితే వారికి మళ్లీ పరీక్ష నిర్వహిస్తారా అని అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. కమిటీ సిఫార్సులను బట్టి నిర్ణయం ఉంటుందని వెల్లడించారు.
నీట్ యూజీ పరీక్షలో అవకతవకలు జరిగాయని.. వాటిపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణకు సిట్ ఏర్పాటుచేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ శనివారం డిమాండ్ చేసింది. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే అది జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయని తెలిపింది. నీట్ అక్రమాలపై కోర్టు సుమోటోగా విచారణ చేపట్టి.. నిందితులను కఠినంగా శిక్షించాలని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ డిమాండ్ చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పరీక్షలు అక్రమ వ్యాపారాలుగా మారాయని ట్విటర్‌లో మండిప్డారు. విద్యార్థుల కలలను నాశనం చేస్తూ వారి భవిష్యత్తుతో నరేంద్ర మోదీ సర్కార్ ఆటలాడుతోందని కాంగ్రెస్ ఎంపీలు దీపేందర్ హుడా, కుమారి సెల్జా విమర్శించారు. ఈ అక్రమాలపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు.
నీట్ పరీక్ష ఫలితాల్లో మహారాష్ట్రలోని చాలామంది విద్యార్థులకు అన్యాయం జరిగినందని.. అందుకే ఆ పరీక్షను వెంటనే రద్దు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం కోరింది. నీట్ పరీక్షలు డబ్బు తీసుకున్న తర్వాతే నిర్వహించి ఉండవచ్చని మహారాష్ట్ర వైద్యవిద్య శాఖ మంత్రి హసన్ ముష్రిఫ్ పేర్కొన్నారు. ఫలితాలు చూస్తే.. మహారాష్ట్రకు చెందిన ఏ విద్యార్థికీ ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో ఎంబీబీఎస్ కోర్సులో సీట్లు దొరకవని చెప్పారు. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి తమ ప్రభుత్వంపై ఒత్తిడి వస్తోందని.. దీనిపై నేషనల్ మెడికల్ కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. ఈ సమస్యపై కోర్టును ఆశ్రయించే ఆలోచనలో కూడా ఉన్నట్లు హసన్ ముష్రిఫ్ తెలిపారు.