అదృష్టం ఉంటే చాలు.. దేనికోసం మనం పరుగులు పెట్టాల్సిన అవసరం లేదు.. అదే మన అడ్రస్ వెతుక్కుంటూ వస్తుందనే సామెత ఆయనకు సరిగ్గా సరిపోతుంది. ఎంపీ టికెట్ కోసం పైరవీలు చేయలేదు.. పార్టీ కోసం కష్టపడి పనిచేయడమే ఆయనకు తెలుసు.. టికెట్ కావాలంటూ ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టలేదు.. అధిష్టానం పెద్దలను అడగలేదు. అవకాశం వస్తే ఎంపీగా పోటీచేస్తానన్నారు. 3 దశాబ్ధాలుగా పార్టీలోనే ఉంటూవచ్చారు. పదవుల కోసం వెంపర్లాడలేదు. చివరికి మోదీ 3.0 కేబినెట్‌లో ఆయనకు చోటు దక్కింది. దేశంలో 543 మంది ఎమ్మెల్యేలు ఉంటే కేంద్రమంత్రి మండలిలో గరిష్టంగా 81మందికి మాత్రమే అవకాశం ఉంటుంది. ఎంపీగా గెలవాలంటే ప్రజల మద్దతు కావాలి. కానీ కేబినెట్‌లో చోటు దక్కాలంటే మాత్రం అన్ని కలిసిరావాలి. ముఖ్యంగా లక్ ఉండాలి. ఆ లక్ ఉండటంతో లక్కీ ఛాన్స్ కొట్టేశారు నరసాపురం బీజేపీ ఎంపీ భూపతిరాజు శ్రీనివాసవర్మ. ఆయనకు టికెట్ రావడమే పెద్ద విచిత్రం.. అలాంటిది మోదీ కేబినెట్ బెర్త్ లభించడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. పార్టీని నమ్ముకుంటే పదవులు అవే వస్తాయనడానికి వర్మ నిదర్శనమని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఏపీ నుంచి బీజేపీ ఎంపీలుగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, సీఎం రమేష్, శ్రీనివాసవర్మ గెలిచారు. రాజమండ్రి ఎంపీ పురందేశ్వరికి గతంలో కేంద్రమంత్రిగా చేసిన అనుభవం ఉంది. దీంతో ఆమెకు మంత్రి పదవి గ్యారంటీ అనే ప్రచారం జరిగింది. కానీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉండటంతో ఆమెకు తొలి విడతలో మంత్రి పదవి దక్కలేదు. అనూహ్యంగా నరసాపురం ఎంపీ శ్రీనివాసవర్మకు మంత్రి పదవి లభించింది. వర్మకు కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కడంతో విధేయతకు దక్కిన పదవిగా బీజేపీ శ్రేణులు అభవర్ణిస్తున్నారు.