ఎన్నికల ముందు వరకు ఏపీలో చర్చంతా ఆయన గురించే.. నామినేషన్ వేసిన రోజు నుంచి ఎన్నికల పోలింగ్ పూర్తయ్యే వరకు గుంటూరు లోక్‌సభ స్థానం అందరి దృష్టిని ఆకర్షించింది. అమెరికాలో పెద్ద వైద్యుడిగా పేరు సంపాదించిన ఆయన ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపీ టికెట్ తెచ్చుకున్నారు. అయినాసరే ఆయన గురించి పెద్దగా చర్చలేదు. కానీ నామినేషన్ వేసిన తర్వాత అఫిడవిట్‌లో ఆయన ఆస్తుల విలువ చూసి అంతా ఆశ్చర్యపోయారు. ఓ సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి వేలకోట్లకు అధిపతి కావడంతో ఏపీ రాజకీయాల్లో పెమ్మసాని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అంతేకాదు.. రాజకీయ సభల్లో ఆయన ప్రసంగాలు ప్రజలందరినీ ఆకట్టుకునేవి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పెమ్మసాని చంద్రశేఖర్ ప్రజల దృష్టిని ఆకర్షించారు. ఎన్నికలు ముగిసాయి.. ఫలితాలు వచ్చాయి.. గుంటూరు ఎంపీగా పెమ్మసాని గెలుపొందారు. ఇక అక్కడితే అయిపోయిందనుకున్నారంతా.. కానీ ఎన్నికల ఫలితాల తర్వాత దేశవ్యాప్తంగా పెమ్మసాని పేరు చర్చనీయాంశమవుతోంది. ఎంపీగా గెలిచిన ఆయనకు అదృష్టం కలిసొచ్చి మోదీ కేబినెట్‌లో బెర్త్ కన్ఫర్మ్ అయింది. టీడీపీ ఎన్డీయే భాగస్వామ్యపక్షంగా ఉండటంతో.. ఆ పార్టీకి తొలి విడతలో రెండు మంత్రి పదవులు దక్కాయి. వీరిలో శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు, గుంటూరు ఎంపీ పెమ్మసానికి అవకాశం దక్కింది. రామ్మోహన్ నాయుడు హ్యాట్రిక్ ఎంపీ కావడంతో పాటు టీడీపీలో సీనియర్ నేత కావడంతో ఆయనకు కేంద్రమంత్రి పదవి ఖాయమైంది. కానీ అనూహ్యంగా మొదటిసారి ఎంపీగా గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్‌కు ఎంపీ పదవి దక్కడంతో ఆయన ఐశ్వర్యవంతుడే కాదు.. అదృష్టవంతుడనే చర్చ సాగుతోంది. టీడీపీ నుంచి ఏపీలో 16మంది ఎంపీలు గెలవగా.. తొలివిడతలో ఇద్దరికి అవకాశం దక్కడం.. ఆ ఇద్దరిలో పెమ్మసానికి కేంద్రమంత్రి పదవి రావడంతో ఆయనకు అదృష్టం కలిసొచ్చిందనే చర్చ సాగుతోంది.