కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ఇటీవల ఎన్నికల్లో విజయం సాధించిన నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్- ఎన్డీఏ కూటమి ముచ్చటగా మూడోసారి కేంద్రంలో అధికారాన్ని చేపట్టనుంది. ఇక గత 10 ఏళ్లుగా దేశ ప్రధానిగా పనిచేస్తున్న నరేంద్ర మోదీ హ్యాట్రిక్ సాధించి.. మూడోసారి ప్రధాని పీఠాన్ని అధిష్ఠించనున్నారు. ఢిల్లీలో ప్రమాణ స్వీకార మహోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది. ప్రధానమంత్రితోపాటు మరో 30 మంది కూడా కేంద్రమంత్రులుగా ప్రమాణం చేయనున్నారు.
కేంద్రమంత్రుల జాబితాలో తెలుగు రాష్ట్రాల ఎంపీలకు కూడా చోటు దక్కనుంది. తెలంగాణ నుంచి సికింద్రాబాద్ ఎంపీ జి. కిషన్ రెడ్డి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్‌లకు మోదీ కేబినెట్‌లో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి టీడీపీ తరఫున శ్రీకాకుళం నుంచి గెలిచిన కింజరపు రాంమోహన్ నాయుడు.. గుంటూరు నుంచి విజయం సాధించిన పెమ్మసాని చంద్రశేఖర్‌ల పేర్లు కేంద్ర మంత్రివర్గంలోకి ఖరారైనట్లు సమాచారం.
కీలక శాఖలు బీజేపీ వద్దే!
ఈ ఎన్నికల్లో సొంతంగా మెజార్టీ మార్కు అందుకోని బీజేపీకి మిత్రపక్షాల మద్దతు అవసరం అయింది. ఈ నేపథ్యంలోనే కూటమిలో టీడీపీ, జేడీయూ వంటి పార్టీలు కీలకంగా మారాయి. దీంతో ఆ పార్టీలు కీలక పదవులపై కన్నేసిన నేపథ్యంలో నరేంద్ర మోదీ మాత్రం కీలక శాఖలను తమ పార్టీ ఎంపీల వద్దే ఉంచేలా పావులు కదుపుతున్నారు. కేంద్ర ప్రభుత్వంలో కీలక శాఖలైన హోం శాఖ, రక్షణ శాఖ, ఆర్థిక శాఖ, విదేశీ వ్యవహారాల శాఖలను తమ వద్దే ఉంచుకుని.. కూటమిలోని పార్టీలకు మిగితా శాఖలను కేటాయించనున్నారు.
అమిత్ షా, రాజ్‌నాథ్, గడ్కరీ, జైశంకర్‌లకు పాత శాఖలే!
నరేంద్ర మోదీ 3.0 లో బీజేపీ అగ్రనేతలకు మళ్లీ అవే శాఖలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. రక్షణ శాఖకు రాజ్‌నాథ్ సింగ్‌ను మరోసారి మంత్రిగా ఉంచనున్నారు. అమిత్ షాకు హోం శాఖ, నితన్ గడ్కరీకి రోడ్డు రవాణా శాఖ, జైశంకర్‌కు విదేశీ వ్యవహారాల శాఖలను కేటాయించనున్నరు. ఇక లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న నిర్మలా సీతారామన్‌ను కూడా తిరిగి మంత్రివర్గంలోకి మోదీ తీసుకోనున్నట్లు సమాచారం.