వైసీపీ నేత జగ్గవరపు వేణుగోపాల్ రెడ్డి అనుమానాస్పద మృతి నూజివీడులో కలకలం రేపింది. దీంతో నియోజకవర్గ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. తూర్పుదిగవల్లిలో కోళ్లఫారం షెడ్‌లో వేణుగోపాల్ రెడ్డి మృతదేహం లభించడంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా బెట్టింగ్ బాబులు రెచ్చిపోయారు. కోట్లలో చేతులు మారాయి. నూజివీడు నియోజకవర్గంలోనూ విపరీతంగా బెట్టింగ్ సాగింది. నూజివీడులో వైసీపీ నేత వేణుగోపాల్ రెడ్డిని నమ్మకమైన మధ్యవర్తిగా భావించి రూ.30కోట్ల పొలిటికల్ బెట్టింగ్ డబ్బును ఆయన వద్ద ఉంచారు బెట్టింగ్ రాయుళ్లు. అయితే కొద్ది రోజుల నుంచి నగదుతో సహా ఆయన అదృశ్యమయ్యారు. దీంతో పందెపురాయుళ్లు, సమీప గ్రామాల ప్రజలు అతని కోసం గాలిస్తున్నారు. అయితే తూర్పుదిగవల్లి కోళ్లఫారం షెడ్‌లో వేణుగోపాల్ రెడ్డి ఇవాళ శవమై కనిపించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. నూజివీడు రూరల్ పోలీసులు మృతదేహాన్ని పంచనామాకు తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు.