ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడం, కనీసం ప్రతిపక్ష హోదా లేకపోవడంతో పార్టీ ఉంటుందా..? ఊడుతుందా అనే విషయం కూడా తెలియట్లేదు. ఈ క్రమంలో ఒక్కొక్కరుగా రాజీనామా చేసి పార్టీ నుంచి బయటికి వచ్చేస్తున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు లాంటి వ్యక్తులు రాజీనామా చేయగా.. తాజాగా మరికొందరు సీనియర్లు రాజీనామా చేశారు. జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు, వైసీపీ సీనియర్ నేత దేరంగుల ఉదయ్ కిరణ్ వైసీపీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మెయిల్లో పంపారు. శనివారం విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజల్ని దారుణంగా మోసం చేస్తూ వచ్చిన జగన్కు అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురు కావడం సబబేనన్నారు. మోసపూరిత పార్టీలో ఉండటం ఇష్టం లేక రాజీనామా చేస్తున్నానని, భవిష్యత్తు కార్యాచరణను త్వరలో ప్రకటిస్తానన్నారు.