ఛండీగఢ్ విమానాశ్రయంలో బాలీవుడ్ నటి, ఇటీవల ఎన్నికైన బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ను కొట్టిన సీఎస్ఎస్ మహిళా కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఆమె ఇప్పుడు సెలబ్రిటీ అయిపోయింది. ఎంపీకి కొట్టినందుకు విధుల నుంచి సస్పెండ్ అయిన ఆమెకు పంజాబ్‌లో రైతులు మద్దతు ప్రకటించారు. తాజాగా, తమిళనాడుకు చెందిన పెరియార్ అభిమాన సంఘం.. ఆమెకు బంగారు ఉంగరం బహుమతిగా పంపాలని నిర్ణయించింది. కోయంబత్తూరులోని తంథై పెరియార్ ద్రావిడర్ కజగం (TPDK) 8 గ్రాముల బంగారు ఉంగరం కానుకగా పంపుతామని ప్రకటించింది.
టీపీడీకే జనరల్ సెక్రెటరీ కొవాయ్ రామకృష్ణన్ మాట్లాడుతూ.. ‘ఉద్యమం చేస్తోన్న రైతులను అవమానించిన కంగనా రనౌత్‌ను కొట్టినందుకు సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కుల్విందర్ సింగ్‌ను అభిమానిస్తూ 8 గ్రాముల బంగారం ఉంగరం బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. పేరియార్ బొమ్మ ఉన్న ఉంగరాన్ని సోమవారం పంపుతాం.. కొరియర్‌లో ఆమె ఇంటి చిరునామాకు పంపుతాం.. ఒకవేళ ఉంగరాన్ని కొరియర్‌లో పంపడం కుదరంటే.. మా ప్రతినిధి రైల్లో లేదా విమానంలో ఆమె ఊరుకు వెళ్తారు.. బంగారు ఉంగరంతో పాటు పెరియార్ పుస్తకాలను అందజేస్తారు’ అని చెప్పారు. రైతులకు మద్దతుగా నిలిచిన కుల్విందర్ ధైర్యవంతురాలని ఆయన కొనియాడారు.
మరోవైపు,తాను ఎందుకు కంగనాను కొట్టాననే విషయాన్ని కుల్విందర్ చెప్పిన విషయం తెలిసిందే. మూడేళ్ల కిందట సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఉద్యమాన్ని ఆమె కించపరస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారని అన్నారు. తన తల్లి కూడా రైతు ఉద్యమంలో పాల్గొందని చెప్పారు. రైతు ఉద్యమాన్ని కించపరుస్తూ అప్పట్లో కంగనా రనౌత్ వ్యాఖ్యలు చేయడంతోనే తాను కొట్టినట్లు సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ కౌర్ వెల్లడించింది. ఈ ఘటనలో ఆమెను అధికారులు సస్పెండ్ చేసి.. ఆమెను అరెస్ట్ చేశారు. దీంతో కుల్వీందర్ కౌర్‌కు అన్యాయం జరగకూడదని.. రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.