నెల్లిమర్లలో అక్రమ నిర్మాణాలు, అనుమతులు లేని బహుళ అంతస్థుల భవనాల నిర్మాణాలపై అధికారులు కొరడా ఝులిపించాలని టీడీపీ జిల్లా కార్యదర్శి లెంక అప్పలనాయుడు, 6వ వార్డు కౌన్సిలర్ లెంక హైమావతి డిమాండ్ చేశారు. నెల్లిమర్లలో శనివారం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. నెల్లిమర్లలో ఎక్కడపడితే అక్కడే అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయని చెప్పారు. అనుమతులే లేకుండా నిర్మాణాలు జరుగుతుంటే నగర పంచాయతీ అధికారులు ఏం చేస్తున్నారని వారు ప్రశ్నించారు. తక్షణమే నగర పంచాయతీ కమిషనర్‌తో పాటు ప్రణాళిక విభాగం అధికారులు స్పందించాలని వారు కోరారు. అనుమతులు లేని భవన నిర్మాణాలను వెంటనే నిలిపివేయించాలని వారు డిమాండ్ చేశారు. నగర పంచాయతీకి పన్నుల ఆదాయం పెంచాలని కోరారు. అలాగే పలు ప్రాంతాల్లో ఉన్న తాగు నీటి సమస్యను, వీధి లైట్ల సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు.