ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పూర్తయిన క్యాబినెట్ కూర్పు.. ఇక ఆ రెండు కీలక పదవుల భర్తీపై బీజేపీ ఫోకస్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 11, 2024, 09:13 PM

ప్రధాని నరేంద్ర మోదీ 3.0 క్యాబినెట్‌లో మంత్రులకు సోమవారం శాఖల కేటాయింపు పూర్తయ్యింది. అత్యంత కీలకమైన నాలుగు శాఖలను బీజేపీ అంటిపెట్టుకుంది. అయితే, అత్యంత ముఖ్యమైన మరో రెండు కీలక పదవుల నియమాకంపై కమలదళం దృష్టిసారించింది. లోక్‌సభ స్పీకర్‌తో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడి నియామకం కోసం కసరత్తులు చేస్తోంది. ప్రస్తుత అధ్యక్షుడు జగతి ప్రకాశ్ నడ్డా పదవీకాలం పూర్తికావడంతో పాటు ఆయనను తిరిగి కేంద్ర క్యాబినెట్‌లోకి తీసుకున్నారు. మోదీ మొదటి క్యాబినెట్‌లో ఆయన నిర్వహించిన వైద్య కుటుంబ సంక్షేమ శాఖ బాధ్యతలనే మళ్లీ కట్టబెట్టారు. దీంతో పాటుగా ఎరువుల, రసాయన మంత్రిత్వ శాఖను కూడా అప్పటించారు.


 ఈ నేపథ్యంలో జాతీయ అధ్యక్షుడి పదవిలో ఎవర్ని నియమిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. మరో మూడు నెలల్లో జమ్మూ కశ్మీర్‌తో పాటు మహారాష్ట్ర, హరియాణా, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో సమర్ధత కలిగిన నేతకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించే యోచనలో బీజేపీ పెద్దలు ఉన్నారు. ఇక, లోక్‌సభ స్పీకర్ ఎంపిక ఇప్పుడు బీజేపీకి అతిపెద్ద సవాల్, ఎందుకంటే తమ పార్టీకి పూర్తి మెజార్టీతో లేకపోవడంతో ఎన్డీయేలోని టీడీపీ, జేడీయూ వంటి పార్టీల మద్దతు కీలకంగా మారింది. స్పీకర్ పదవిని ఈ రెండు పార్టీలూ డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల పలు రాష్ట్రాల్లో అధికార పార్టీలు చీలిక వచ్చి, ప్రభుత్వాలు కూలిపోయిన సందర్భాలను దృష్టిలో పెట్టుకుని టీడీపీ, జేడీయూలు జాగ్రత్తపడుతున్నాయి. ఒకవేళ, చీలిక ఏర్పడితే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద వారిపై అనర్హత విషయంలో స్పీకర్ పాత్ర కీలకం. అందుకే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, బిహార్ మాజీ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌లు తమకే స్పీకర్ పదవి దక్కాలని కోరుకుంటున్నారు.


అయితే, బీజేపీ కూడా స్పీకర్ పదవిని వదులుకోడానికి అంగీకరించడం లేదని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నారు. స్పీకర్‌గా ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పేరు పరిశీలనలో ఉందని ప్రచారం సాగుతోంది. కానీ, దీని అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు. మాజీ సీఎం ఎన్టీఆర్ కుమార్తె అయిన పురందేశ్వరి.. చంద్రబాబు నాయుడికి స్వయానా వదిన. ఆమెను స్పీకర్‌ సీటులో కూర్చోబెడితే టీడీపీ నుంచి అభ్యంతరం ఉండదని కమలనాథులు భావిస్తున్నట్టు తెలుస్తోంది.


ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో పురందేశ్వరి రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. గతంలో యూపీయేలో మన్మోహన్ క్యాబినెట్‌లో మంత్రిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున మొదటిసారిగా 2004 సార్వత్రిక ఎన్నికల్లో బాపట్ల నుంచి పోటీచేసిన పురందేశ్వరి.. టీడీపీ అభ్యర్ధి, మూవీ మొఘల్ రామానాయుడిపై విజయం సాధించారు. 2009లో విశాఖపట్నం నుంచి గెలిచి, మన్మోహన్ క్యాబినెట్‌లో కేంద్ర మానవవనరుల శాఖ సహాయ మంత్రిగా చేరారు. కానీ, 2014లో రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్‌ను వీడి.. బీజేపీలో చేరారు. మోదీ 3.0 క్యాబినెట్‌లో ఆమెకు బెర్తు దక్కుతుందని నమ్మకంగా ఉన్నారు. కానీ, ఏపీ నుంచి బీజేపీ ఎంపీ శ్రీనివాసవర్మను మోదీ తన మంత్రివర్గంలోకి తీసుకుని ఆశ్చర్యానికి గురిచేశారు. అయితే, ఆమెకు స్పీకర్‌ పదవిని కట్టబెట్టాలనే ఉద్దేశంతో మంత్రి పదవి ఇవ్వలేదనే ప్రచారం సాగుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com