భారత్‌లో పర్యటిస్తున్న మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు.. ప్రధాని నరేంద్ర మోదీతో మంగళవారం భేటీ అయ్యారు. భారత్‌తో సన్నిహిత, చారిత్రాత్మక సంబంధాలను విస్తరించడానికి తాము కట్టుబడి ఉన్నామని ఆయన ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. ఈ తరుణంలో గత ప్రభుత్వం.. భారత్‌తో కుదుర్చుకున్న మూడు ఒప్పందాలను సమీక్షించాలని మాల్దీవుల పార్లమెంటరీ కమిటీ నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. మాజీ అధ్యక్షుడు, భారత అనుకూల నేతగా గుర్తింపు పొందిన ఇబ్రహీం సోలిహ్ హయంలో జరిగిన ఒప్పందాలు.. మాల్దీవుల సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించాయని కమిటీ ఆరోపించింది.
హైడ్రోగ్రాఫిక్ సర్వే, భారత్ నిధులతో నిర్మిస్తోన్న ఉతురు తిలాఫల్హు డాక్‌యార్డ్.. మానవతా, సహాయక చర్యల కోసం మాల్దీవుల రక్షణ దళాలకు బహుమతిగా ఇచ్చిన డోర్నియర్ విమానాల ఒప్పందాలు దేశ సార్వభౌమాధికారం, స్వేచ్ఛకు విఘాతం కలింగిచేలా ఉన్నాయని పేర్కొంది. ఈ మూడు ఒప్పందాలను సమీక్షించాలని జాతీయ భద్రత సేవలకు సంబంధించిన పార్లమెంటరీ కమిటీ నిర్ణయించినట్టు సెంట్రల్ హితాధూ ఎంపీ అహ్మద్ అజాన్‌ను ఉటంకిస్తూ మాల్దీవుల మీడియా కథనం ప్రచురించింది. దేశ స్వాతంత్ర్యం, సార్వభౌమాధికారాన్ని ప్రభావితం చేశాయని ఆరోపిస్తూ పార్లమెంటరీ విచారణ ప్రారంభించాలని ఆయన ప్రతిపాదించారు.
అయితే, హ్రైడ్రోగ్రాఫిక్ సర్వే కోసం భారత్ నౌకాదళంతో చేసుకున్న సంయుక్త ఒప్పందాన్ని పునరుద్దరించబోమని గతేడాది అధ్యక్షుడిగా ఎన్నికైన వెంటనే ముయిజ్జు ప్రకటించారు. ఇక, ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారంలో పాల్గొన్న మాల్దీవుల అధ్యక్షుడు..రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా తమకు భారత్ అందజేస్తోన్న నిరంతర సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. ‘ప్రస్తుతం ఉన్న సంబంధాలను మరింత పటిష్టం చేసుకునేందుకు తాను ఎదురుచూస్తున్నట్లు ఆయన చెప్పారు’ అని ఆయన కార్యాలయం ప్రకటించింది.
కాగా, గతేడాది ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటన గురించి సోషల్ మీడియాలో మాల్దీవులు మంత్రులు చేసిన అనుచిత వ్యాఖ్యలతో వివాదం మొదలైంది. భారతీయుల బాయ్‌కాట్ మాల్దీవులకు పిలుపునివ్వడంతో ఆ దేశానికి పర్యాటకులు తగ్గిపోయారు. ముయిజ్జు మంత్రుల వ్యాఖ్యలను మాజీ అధ్యక్షులు ఇబ్రహీం సోలిహ్, మహ్మద్ నషీద్‌లు తీవ్రంగా ఖండించారు.