ఈ పిచ్చి మొక్కను చూశారా..? మన దగ్గర ఏ ఊరికి వెళ్లినా.. పొలం గట్ల వెంబడి, బీడు భూముల్లో ఎక్కువగా కనిపిస్తుంది. దీని పేరు పార్థీనియం హిస్టెరోఫోరస్. ఊళ్లలో కాంగ్రెస్ గడ్డి, క్యారెట్ గడ్డి, వయ్యారి భామ అని కూడా పిలుస్తుంటారు. ఈ పిచ్చి మొక్కను నిర్మూలించడం కోసం ఇప్పుడు సైన్యం రంగంలోకి దిగింది. భారత్-బంగ్లాదేశ్ బోర్డర్‌లో 46 కి.మీ. పొడవైన రోడ్డుకి ఇరువైపులా బీఎస్ఎఫ్ జవాన్లు ఈ పిచ్చి మొక్కను ఏరిపారేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో అసలు ఈ పిచ్చి మొక్క మన దేశంలోకి ఎలా ప్రవేశించింది..? ఇది ఆరోగ్యానికి అంత ప్రమాదకరమైందా..? దీని వల్ల నష్టాలేంటి..? లాభాలు కూడా ఉన్నాయా..? అనే విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం..
పార్థీనియం హిస్టెరోఫోరస్ అనే కలుపు మొక్క హానికరమైంది. ఇది అమెరికా, ఆసియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా ఖండాల్లో కనిపిస్తుంది. ఇది మనుషుల్లో చర్మ సంబంధ సమస్యలు, ఉబ్బసం, బ్రాంకైటిస్ లాంటి సమస్యలకు కారణం అవుతుంది. పశువులకు సైతం దీని వల్ల ఆరోగ్యపరమైన ఇబ్బందులు తలెత్తుతాయి. అందుకే పశువులు వీటిని మేసేందుకు ఇష్టపడవు. పార్థీనియం మొక్కల కారణంగా.. పంట దిగుబడి తగ్గిపోతుంది. ఈ మొక్క తక్కువ సమయంలో తన సంతతిని పెంచుకుంటుంది. ఇవి ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోవడం వల్ల ఇతర మొక్కలు పెరిగే అవకాశం తగ్గుతుంది. ఫలితంగా జీవవైవిధ్యానికి ముప్పు కలుగుతుంది.
ఈ పిచ్చి మొక్కకు ఆర్థికంగా ఎలాంటి ప్రాధాన్యం లేదు. వెచ్చని వాతావరణ పరిస్థితుల్లో ఇది ఎక్కువగా పెరుగుతుంది. ఈశాన్య మెక్సికో, అమెరికాల్లో ఇది స్థానికంగా పెరిగేది. 20వ శతాబ్దంలో ఇది ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఆసియా దేశాలకు విస్తరించిన ఈ మొక్క.. ఇప్పుడు ప్రపంచంలోని ఏడు అత్యంత ప్రమాదకరమైన కలుపు మొక్కలలో ఒకటిగా మారింది. గతంలో అమెరికా నుంచి పంపిన గోధుమలు, ఆహార ధాన్యాల కంటైనర్ ద్వారా ఈ మొక్క 1950ల్లో భారత్‌లోకి ప్రవేశించిందని భావిస్తున్నారు.
బీడు భూములు, పట్టణాల్లోని కాలనీలు, రైల్వే ట్రాక్‌లు, రోడ్లు, డ్రైనేజీ, పంట కాల్వల గట్ల మీద ఈ మొక్కలు ఎక్కువగా కనిపిస్తాయి. తోటలు, కూరగాయలు సాగు చేసే భూముల్లోనూ ఈ కలుపు మొక్క ఎక్కువగా పెరుగుతుంది. ఒక పార్థీనియం మొక్క పది వేల నుంచి 15 వేలక వరకు విత్తనాలను ఉత్పత్తి చేస్తుంది. ఈ విత్తనాలు గాలి ద్వారా వ్యాప్తి చెంది.. తిరిగి మొలకెత్తుతాయి. అలా ఈ మొక్క వేగంగా ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందుతుంది. పూలు పూయడానికి ముందే వేర్లతో సహా పీకేయడం, నేలను దున్నడం, రసాయనాల పిచికారీ, యూకలిప్టస్ ఆయిల్ పిచికారీ, ఆకులు తినే కీటకాలను ప్రవేశపెట్టడం ద్వారా ఈ మొక్కల వ్యాప్తిని అరికట్టొచ్చు. అయితే ఈ మొక్కలకు ఎక్కువగా ఎక్స్‌పోజ్ అయితే వాటి పూల పుప్పొడి ద్వారా ఆరోగ్యం దెబ్బతింటుందనే విషయాన్ని మర్చిపోవద్దు.
ఇది కేవలం పిచ్చి మొక్క మాత్రమేనని.. దీని వల్ల అనారోగ్యం తప్పితే ఇతర ప్రయోజనాలేవీ లేవని ఇన్నాళ్లూ భావించారు. అయితే అమెరికా ప్రభుత్వానికి చెందిన నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ప్రకారం.. ఈ మొక్క వల్ల ప్రయోజనాలు కూడా ఉన్నాయి. చర్మపు మంట, రుమాటిక్ నొప్పి, విరేచనాలు, యూరిన్ ఇన్ఫెక్షన్లు, విరేచనాలు, మలేరియా, న్యూరల్జియాకు నివారణకు ఇది ఔషధంగా ఉపయోగపడుతుంది. నీటి కలుపు మొక్కల నిర్మూలన, బయోగ్యాస్ ఉత్పత్తికి పశువుల ఎరువుతో కలిపి వాడటం, బయోపెస్టిసైడ్, పచ్చి ఎరువు మరియు కంపోస్ట్ ఎరువు తయారీకి కూడా ఈ మొక్కలను ఉపయోగించొచ్చని అమెరికా వెబ్ సైట్ వెల్లడించింది.