ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన కేబినెట్ మంత్రులకు నేడు(శుక్రవారం) శాఖలను కేటాయించిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో పవన్ కళ్యాణ్‌కు డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను కేటాయించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్, ఇతర మంత్రులు అందరికీ ట్విట్టర్(X) వేదికగా చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘మంత్రివర్గంలోని నాతోటి వారందరికీ శాఖల కేటాయింపు సందర్భంగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. అందరం కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేస్తూ, ప్రజాపాలన శకానికి నాంది పలుకుదామని ప్రతిజ్ఞ చేద్దాం. మంత్రులుగా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి కృషి చేస్తారని నేను విశ్వసిస్తున్నాను. సేవ, భక్తితో కూడిన ఈ యాత్రను ప్రారంభించిన అందరికీ నా శుభాకాంక్షలు’’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.