శ్రీకాకుళం జిల్లా, సిక్కోలు నగరం గత కొన్నాళ్లుగా నెత్తుటి గాయాలతో అట్టుడికిపోతుంది. గూనపాలెంలో గొడ్డలి వేటుతో హత్యా ఉదంతం మరువక ముందే.. అదే ప్రాంతంలో ప్రియుడితో కలిసి భార్యే కిరాతకంగా భర్తను హతమార్చిన ఘటన చోటుచేసుకుంది. ఈ కేసులో అసలు నిందితుడు ఇంకా దొరకక ముందే బలగ హాస్పిటల్ రోడ్డులో పట్టపగలు నడి రోడ్డుపై ఓ వ్యక్తిని కత్తితో వెంటాడిన ఘటన నగరవాసులను ఉలిక్కిపడేలా చేసింది. వివరాల్లోకి వెళ్తే.. నగరంలోని గుడివీధి సమీపంలోని దమ్మల రెల్లివీధికి చెందిన నల్లపిల్లి గౌరీశంకర్ అనే 26 ఏళ్ల యువకుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో బలగ హాస్పిటల్ రోడ్డు సమీపంలో నివసిస్తున్న స్నేహితుడి వద్దకు తన బావ విజయకుమార్‌తో కలిసి ద్విచక్రవాహనం పై శంకర్ వెళ్లాడు. బలగ సచివాలయం వద్దకు చేరుకునే సరికి.. వీరి వెనుకే ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంపై వస్తూ కత్తితో దాడికి యత్నించాడు. దీన్ని గమనించిన విజయకుమార్ తన వాహనాన్ని వెనక్కి తిప్పేందుకు ప్రయత్నించగా.. దాడి చేయడానికి వచ్చిన వ్యక్తి తన వాహనాన్ని కింద పడేసి పరుగెత్తుకు వచ్చి గౌరీశంకర్‌పై కత్తితో దాడి చేశాడు. దీంతో శంకర్ తన ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీశాడు. ఈ క్రమంలో బలగ జంక్షన్‌కు చేరుకుని ఆటో ఎక్కి టూటౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసులను ఆశ్రయించాడు. అక్కడ నుంచి పోలీసుల సాయంతో రిమ్స్‌కు వచ్చి చికిత్స తీసుకుంటున్నాడు. గౌరీశంకర్‌పై కత్తితో దాడి చేసిన వ్యక్తి డేఅండ్‌నైట్ కూడలి సమీపంలో ఉన్న రాయ్‌కాలనీ దగ్గర మందలవీధికి చెందిన బొమ్మాళి గిరిగా పోలీసులు గుర్తించారు. బాధితుడు శంకర్‌కి గిరి చెల్లెలు అనిత మంచి స్నేహితురాలు.. వీరి స్నేహం ప్రేమగా మారింది. ఇది గిరి కుటుంబ సభ్యులకు నచ్చకపోవడంతో శంకర్ దూరమవుతాడన్న బాధతో అనిత ఐదేళ్ల కిందట ఆత్మహత్య చేసుకుంది. ఈ నేపథ్యంలో శంకర్ వల్లే అనిత చనిపోయిందని ఆమె కుటుంబ సభ్యులు రెండో పట్టణ పోలీసు స్టేషన్‌లో కేసు పెట్టారు. ఈ కేసులో శంకర్ గెలిచాడని, పెద్దమనుషుల సమక్షంలో కేసు సద్దుమనిగిందని శంకర్ చెబుతున్నాడు. అయితే అనిత సోదరుడు బొమ్మాళి గిరి మాత్రం శంకర్‌పై కక్ష పెంచుకుని.. ఇప్పుడు హతమార్చేందుకు ప్రయత్నించాడు. అయితే దాడి జరిగిన సమయంలో శంకర్ బావ విజయ్‌కుమార్ అడ్డుకోవడం, కత్తి పదునుగా లేకపోవడంతో శంకర్ ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే ఈ దాడిలో శంకర్ ఎడమ చేతి మీద రెండు చోట్ల కత్తి గాట్లు కాగా, శంకర్ మొహంపై, మెడ మీద గాయాలయ్యాయి. శంకర్ ఎడమ చేయి వైపు స్పర్శ లేకపోవడంతో రిమ్స్ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. తమకు ప్రాణ హాని ఉందని రక్షణ కల్పించాలని శంకర్ బావ విజయకుమార్ పోలీసులను కోరాడు. శంకర్‌పై హత్యాయత్నం జరిగిందన్న విషయం తెలుసుకున్న అతడి కుటుంబ సభ్యులు రిమ్స్‌కు చేరుకుని బోరున విలపించారు. విషయం తెలుసుకున్న టూ టౌన్ సీఐ జి.ఉమామహేశ్వరరావు బాధితుడి వాంగ్మూలం ఆధారంగా కేసు నమోదు చేశారు. కత్తితో దాడికి పాల్పడిన గిరి పరారీలో ఉండగా, అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీ కెమెరాల ద్వారా పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.