ఆంధ్రప్రదేశ్‌లో అధికారం కోల్పోయిన వైసీపీపై సోషల్ మీడియాలో పెద్దయెత్తున ట్రోలింగ్ నడుస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబును, పవన్ కల్యాణ్‌ను వ్యక్తిగత విమర్శలు చేసిన మాజీ మంత్రులు కొడాలి నాని, ఆర్కే రోజా, గుడివాడ అమర్‌నాథ్, పేర్ని నాని లీడర్లు నెట్టింట ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వస్తోంది. అయితే గతంలో చంద్రబాబుపై చేసిన ఛాలెంజ్‌ల కారణంగా మాజీ మంత్రికొడాలి నానిని ఈ ట్రోలింగ్ మరింత ఎక్కువగా ఇబ్బంది పడుతున్నట్లుగా తెలుస్తోంది. ఎన్నికల్లో ఎన్డీయే కూటమి గెలిచిన వెంటనే టీడీపీ కార్యకర్తలు కొడాలి నాని ఇంటిపైకి కోడిగుడ్లు విసిరారు.తాజాగా కొడాలి నానిని టార్గెట్ చేస్తూ గుంటూరు నగరంలో ఫ్లెక్సీలు వెలిశాయి.
‘కుప్పంలో చంద్రబాబు గెలిస్తే రాజకీయాలు వదిలేసి, ఆయన బూట్ పాలిష్ చేస్తూ ఆయన కాళ్ల దగ్గరే పడుంటా అని ఛాలెంజ్ చేసిన కొడాలి నాని ఎక్కడ దాక్కున్నా బయటకు రావాలి’ అంటూ టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు పేరిట గుంటూరులో ఫ్లెక్సీలు వెలిశాయి. ప్రస్తుతం ఈ ఫ్లెక్సీలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక పోస్టులను టీడీపీ శ్రేణులు, అభిమానులు వైరల్ చేస్తున్నారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో గుడివాడలో కొడాలి నాని ఓటమి పాలయ్యారు. వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన నాని.. టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము చేతిలో 53 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో కొడాలి నాని వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004, 2009 ఎన్నికల్లో టీడీపీ తరుపున ఎమ్మెల్యేగా గెలిచిన కొడాలి నాని.. 2014, 19 ఎన్నికల్లో వైసీపీ నుంచి శాసనసభ్యుడిగా విజయం సాధించారు. అయితే 2024లోనూ గుడివాడలో మరోసారి విజయం నాదేనన్న ధీమాతో కొడాలి నాని ఛాలెంజ్ చేసినట్లు టీడీపీ శ్రేణులు చెప్తున్నాయి.