గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మహిళలకు గుడ్ న్యూస్.. ఇక ఇంట్లో నుంచే సంపాందించుకునే మార్గం మీ ముందు ఉంది. రూరల్ డెవలప్‌మెంట్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఈ అవకాశం కల్పిస్తోంది. అయితే అందరికీ కాదండోయ్.. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన గ్రామీణ మహిళలకు రూడ్ సెట్ సంస్థ ఈ అవకాశం కల్పిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోని వారికి స్వయం ఉపాధి శిక్షణ అందించి.. వారి కాళ్ళ మీద వారు నిలబడేలా చేయాలనేదే ఈ సంస్థ ఉద్దేశం. అందులో భాగంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా మహిళలకు అవకాశం కల్పించింది. గ్రామీణ ప్రాంత మహిళలకు మగ్గం వర్క్‌లో ఉచితంగా శిక్షణ అందించనున్నట్లు ప్రకటించింది.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని గ్రామీణ మహిళలకు మగ్గం వర్క్‌లో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లుగా ప్రకాశం జిల్లా రూడ్ సెట్ సంస్థ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈనెల 24 నుంచి నుంచి ఒంగోలులో శిక్షణ ఉంటుందని వెల్లడించారు. ఇందుకోసం ఆసక్తి కలిగిన 18 ఏళ్ల నుంచి 45 ఏళ్లలోపు మహిళలు తమ వివరాలతో పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. మరోవైపు శిక్షణ కాలంలో ఉచిత భోజన వసతి, సదుపాయాలు ఉంటాయని రూడ్ సెట్ సంస్థ తెలిపింది. మహిళలు సొంత కాళ్ల మీద నిలబడేలా చేయాలనేదే తమ ఉద్దేశమని తెలిపింది.
రూరల్ ఎంప్లాయిమెంట్ అండ్ సెల్ఫ్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ స్వచ్ఛంద సంస్థను 1982లో స్థాపించారు. గ్రామీణ ప్రాంతాల్లోని వారికి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో వివిధ కోర్సుల్లో ఈ సంస్థ శిక్షణ అందిస్తూ ఉంటుంది. పలు జిల్లాలలోనూ రూడ్ సెట్ సంస్థకు ఆఫీసులు ఉన్నాయి. రూడ్ సెట్ కార్యాలయాల ద్వారా గ్రామీణ ప్రాంతాల వారికి ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, కార్ డ్రైవింగ్, బైక్ మెకానిక్, సెల్ ఫోన్ రిపేర్, మగ్గం వర్క్, కంప్యూటర్ కోర్సులు వంటి వాటిలో ఉచితంగా శిక్షణ అందిస్తూ ఉంటారు. అలాగే ట్రైనింగ్ సమయంలో వారికి ఉచిత భోజన సౌకర్యం, రానుపోనూ ఛార్జీలు సైతం చెల్లిస్తుంటారు.