ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యవహరించనున్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు జూన్ 21, 22వ తేదీల్లో జరగనున్నాయి. ఈ సమావేశాల్లోనే కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక ఉంటుంది. ఇక ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించేందుకు ప్రొటెం స్పీకర్ ఉండాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలలో సీనియర్ అయిన గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించాలని మంత్రి పయ్యావుల కేశవ్ ఆయనకు ఫోన్ చేశారు. దీనికి గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా అంగీకరించారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.
బుధవారం మీడియాతో మాట్లాడిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. ఈ విషయాన్ని తెలిపారు. " ఇదేమంత పెద్ద ఇష్యూ కాదు. ప్రొటెం స్పీకర్‌గా ఉండమని అడిగారు. ఎవరైనా సీనియర్లు ఉంటే చూడమని చెప్పా. అయితే ఏడోసారి ఎమ్మెల్యేగా గెలిచినందున నేనే సీనియర్‌ను అని.. నన్నే ఉండమని కోరారు. దీంతో అంగీకరించా. ప్రొటెం స్పీకర్‌గా శాసనసభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తా. అంతకంటే ముందు రేపు (జూన్ 20) గవర్నర్ అబ్దుల్ నజీర్ వద్ద ప్రమాణం చేస్తా. ఆ తర్వాత 174 మందితో అసెంబ్లీలో ప్రమాణ స్వీకారాలు చేయిస్తా. వైఎస్ జగన్ అసెంబ్లీకి వస్తారో రారో నాకు తెలీదు. అయితే చంద్రబాబు అయినా, వైఎస్ జగన్ అయినా.. అసెంబ్లీలో ప్రమాణం చేయాల్సిందే".. అని గోరంట్ల బుచ్చయ్య చౌదరి చెప్పారు.
మరోవైపు ప్రస్తుత అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు తర్వాత ఎక్కువసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉన్నారు.చంద్రబాబు ఇప్పటి వరకూ 9 సార్లు ఎమ్మెల్యేగా గెలిస్తే.. గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఏడుసార్లు శాసనసభ్యుడిగా గెలుపొందారు. గోరంట్లతో పాటుగా చింతకాయల అయ్యన్నపాత్రుడు కూడా ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈయననే స్పీకర్ చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఇక ఆ తర్వాత స్థానాల్లో కింజరాపు అచ్చెన్నాయుడు (6 సార్లు) ఉన్నారు. మరోవైపు రెండురోజుల పాటు సభ్యుల ప్రమాణ స్వీకారాలు ఉండనున్నాయి. ఆ తర్వాత అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక ఉంటుంది.