రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ దివంగత రామోజీరావుకు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల నివాళులర్పించారు. బుధవారం రామోజీ ఫిల్మ్ సిటీకి చేరుకున్న షర్మిల.. రామోజీరావు ఫోటో వద్ద అంజలి ఘటించారు. అనంతరం కుటుంబసభ్యులను పరామర్శించారు. రామోజీరావు సతీమణి రమాదేవి, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్, రామోజీ ఫిల్మ్‌సిటీ ఎండీ విజయేశ్వరి సహా కుటుంబసభ్యులను వైఎస్ షర్మిల పరామర్శించి.. సానుభూతి తెలియజేశారు. మరోవైపు జూన్ 8వ తేదీన రామోజీరావు కన్నుమూశారు. శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులతో ఆస్పత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
రామోజీరావు మరణం తర్వాత పలువురు ప్రముఖులు రామోజీరావు కుటుంబాన్ని పరామర్శించారు. రాజకీయ, సినీ, క్రీడారంగాలకు చెందిన ప్రముఖులు రామోజీ ఫిల్మ్ సిటీకి చేరుకుని.. అక్షర యోధుడికి అంజలి ఘటించారు. ఈ క్రమంలోనే వైఎస్ షర్మిల కూడా.. ఆర్ఎఫ్‌సీని సందర్శించి రామోజీ చిత్రపటానికి అంజలి ఘటించారు. కుటుంబసభ్యులతో మాట్లాడి వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అయితే వైఎస్ కుటుంబానికి, రామోజీరావుకు మధ్య విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే. ఇలాంటివన్నీ పక్కనపెట్టి షర్మిల.. రామోజీ కుటుంబసభ్యులను కలిసి తన సానుభూతి తెలియజేశారు.
ఇక 1936 నవంబర్ 16వ తేదీ కృష్ణాజిల్లాలోని పెదపారుపూడిలో జన్మించిన రామోజీరావు.. వ్యాపారాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగారు. ఈనాడు పత్రిక ద్వారా మీడియో మొఘల్‌గా పేరుతెచ్చుకున్నారు. జర్నలిజం స్కూల్ ద్వారా ఎంతో మంది పాత్రికేయులను తీర్చిదిద్దారు. రామోజీరావు చనిపోయారనే వార్త తెలుసుకుని పలువురు ప్రముఖులు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ప్రభుత్వ లాంఛనాల మధ్య అంత్యక్రియలను నిర్వహించగా.. తెలుగు రాష్ట్రాల నుంచి రాజకీయ, సినీ, క్రీడా, వ్యాపార ప్రముఖులు హాజరయ్యారు. అంత్యక్రియల సమయంలో వెళ్లే అవకాశం దక్కని వారు.. ఫిల్మ్ సిటీని సందర్శించి రామోజీరావు చిత్రపటానికి నివాళులు అర్పిస్తున్నారు.