నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతిపై ఫోకస్ పెట్టారు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని రాజధానిగా ప్రకటించిన అప్పటి టీడీపీ ప్రభుత్వం.. రాజధాని నిర్మాణం కోసం రైతుల నుంచి భూములను కూడా సేకరించింది. అలాగే పలు భవనాల నిర్మాణాన్ని ప్రారంభించింది. అయితే 2019 ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన వైసీపీ.. మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. విశాఖను పరిపాలన రాజధానిగా చేసుకుంటామని అప్పటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. ఆ తర్వాత అమరావతిలో రాజధాని నిర్మాణాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏపీ రాజధాని అమరావతేనని స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు.. గురువారం ఆ ప్రాంతంలో పర్యటించనున్నారు.
మరోవైపు చంద్రబాబు నాయుడు రాజధాని పర్యటన షెడ్యూల్‍ను మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. గురువారం ఉదయం 11 గంటలకు ప్రజావేదిక సందర్శన ద్వారా చంద్రబాబు పర్యటన ప్రారంభమవుతుందని నారాయణ చెప్పారు. ఆ తర్వాత రాజధాని నిర్మాణం కోసం ఉద్దండరాయునిపాలెంలో ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని చంద్రబాబు పరిశీలిస్తారని చెప్పారు. ఆ తర్వాత సీడ్ యాక్సిస్ రోడ్, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు, మంత్రులు, న్యాయమూర్తుల క్వార్టర్స్‌లను సీఎం చంద్రబాబు సందర్శిస్తారని నారాయణ తెలిపారు. చివరగా సీఆర్‌డీఏ ఆఫీసును సందర్శించి.. అక్కడ విలేకర్ల సమావేశం నిర్వహిస్తారని మంత్రి నారాయణ వెల్లడించారు.
మరోవైపు అమరావతిలో రాజధాని నిర్మాణంపైనా మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ముందుగా కమిటీలు వేసి రాజధాని ప్రాంతంలో జరిగిన నష్టాన్ని పరిశీలిస్తామని చెప్పారు. అలాగే నిర్మాణం కోసం కొత్తగా టెండర్లు పిలవాల్సి ఉంటుందన్నారు. కొత్త అంచనాలను రూపొందించి.. ఆ తర్వాత టెండర్లు పిలుస్తామన్నారు. ఇందుకోసం మూడు నుంచి నాలుగు నెలల సమయం పట్టే అవకాశం ఉందని నారాయణ చెప్పారు. రాజధానిలో నిర్మాణాలను ఎప్పుడు ప్రారంభించాలనేదీ మంత్రివర్గంలో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఏపీ మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు.
మరోవైపు రాజధాని ప్రాంతంలో ప్రభుత్వ సామాగ్రి చోరీపైనా మంత్రి నారాయణ స్పందించారు. సామాగ్రిని చోరీచేసిన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రాజధానిలో ఇళ్ల స్థలాల విషయం సుప్రీంకోర్టులో ఉందని.. దానిపై న్యాయ సలహా తీసుకుని ముందుకు వెళ్దామని స్పష్టం చేశారు.