ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో ఆయన బాధ్యతలు చేపట్టి.. కొన్ని ఫైల్స్‌పై సంతకాలు చేశారు. అనంతరం పార్టీల నేతలు, అధికారులు శుభాకాంక్షలు తెలియజేయగా.. వరుసగా సమీక్షలతో బిజీ అయ్యారు. అయితే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించే సమయంలో.. ఆయన టేబుల్‌పై ఓ బుక్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ బుక్‌కు పవన్ ఎందుకు అంత ప్రాధాన్యం ఇచ్చారా అని చూస్తే.. అప్పుడు అసలు విషయం తెలిసింది.
పవన్ కళ్యాణ్‌కు మొదటి నుంచి పుస్తకాలు చదవడం, రచనలు అంటే చాలా ఇష్టం.. సాహిత్యంపై ఆసక్తి ఉందని చెబుతుంటారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన కొన్ని పుస్తకాలన్ని ప్రత్యేకంగా తెప్పించుకుని మరీ చదివారు. ఆయన ఎప్పుడో ఏదో ఒక పుస్తకాన్ని చదువుతుంటారని చెబుతుంటారు. అయితే పవన్ కళ్యాణ్‌కు ఓ బుక్ అంటే మాత్రం చాలా ఇష్టమట.. ఆ పుస్తకాన్ని డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించే సమయంలో కూడా తన టేబుల్‌పై పెట్టుకున్నారు. ఆయనను ఇటీవల బాగా కదిలించిన గొప్ప పుస్తకం ఆధునిక మహాభారతం అని చెబుతుంటారు.
తెలుగు సాహిత్యంలో ప్రభంజనం సృష్టించిన గుంటూరు శేషేంద్ర శర్మ ఈ ఆధునిక మహాభారతం పుస్తకాన్ని రాశారు. ఆ పుస్తకం పవన్ కళ్యాణ్‌పై అంత తీవ్ర ప్రభావం చూపించింది. ఆ బుక్ చదివినప్పటి నుంచి ఎక్కడికి వెళ్లినా తన వెంటే తీసుకెళుతున్నారు. ఇవాళ కూడా ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు చేపడుతూ ఆ బుక్‌ను తన పక్కనే టేబుల్‌పై ఉంచుకున్నారు. అంతేకాదు ఆ పుస్తకంలో కొన్ని పదాలను ఆయన రాశారు.. ఆ బుక్‌లోని 'ఒక దేశపు సంపద ఖనిజాలు కాదు. నదులు, అరణ్యాలు కాదు. కలలు ఖనిజాలతో చేసిన యువత' అంటూ రాసిన వాఖ్యాలను గుర్తు చేసుకుంటారు. పవన్ కళ్యాణ్ గుంటూరు శేషేంద్ర శర్మను ఎన్నో సందర్భాల్లో ప్రస్తావించారు.
మన దేశ భవిష్యత్తుకు నావికులు అని మహాకవి శేషేంద్ర శర్మ మాటలు.. తనను ఎంతో ప్రభావితం చేశాయి అంటుంటారు పవన్ కళ్యాణ్. అంేతకాదు ఈ పుస్తకాన్ని పవన్ కళ్యాణ్ రీ పబ్లిష్ చేయించడం విశేషం.
పవన్ కళ్యాణ్ నందమూరి బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోకు . శేషేంద్ర శర్మ గురించి ప్రస్తావనకు వచ్చింది. శేషేంద్ర శర్మ రచననలలో తను ప్రశ్నలకు సమాధానాలు కనిపించాయని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ప్రజల కష్టాలు, ఇప్పటి జీవితాలు ఆయన రచనల్లో బాగా కనిపిస్తాయని.. దర్శకుడు త్రివిక్రమ్ తనకు ఆయన పుస్తకాలను పరిచయం చేశారన్నారు. ఆయన రాసిన పుస్తకాల్లో కొన్ని పాడైపోయే పరిస్థితిలో ఉన్నాయని తనకు తెలిసిందన్నారు. వాళ్ల అబ్బాయి దగ్గర ఓ పాత బుక్ ఉందని తెలిస్తే.. మాట్లాడి ఆ పుస్తకాన్ని రీ ప్రింట్ చేయించినట్లు చెప్పారు. అంతటి గొప్ప కవి శేషేంద్ర శర్మను కొత్త తరానికి పరిచయం చేసే అవకాశం తనకు వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఆయన రాసిన పుస్తకాలు ఇప్పటి తరానికి తెలియాలనే.. తాను రీ ప్రింట్ చేయించానన్నారు పవన్ కళ్యాణ్.
గుంటూరు శేషేంద్రశర్మ గొప్ప తెలుగు కవి.. విమర్శకుడు, సాహితీవేత్త, వక్తగా ఉన్నారు. అలాగే ఆయన సంస్కృత, ఆంధ్ర, ఆంగ్ల భాషల్లో పండితులు. శేషేంద్ర శర్మ 1927 అక్టోబర్ 20న నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం నాగరాజుపాడులో జన్మించారు. ఆయన ఏసీ కాలేజీ నుంచి పట్టభద్రుడయ్యారు. ఆ తర్వాత మద్రాసు లా కాలేజీ నుంచి లా డిగ్రీ పూర్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మున్సిపల్ కమిషనర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు.. 2007 మే 30 రాత్రి గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. శేషేంద్ర శర్మ వచన కవిత్వం, పద్యరచనలో ప్రతిభావంతులు. ఆధునిక కవిత్వంలో విలక్షణ ఊహాశాలిత ప్రత్యేకతగా చెబుతారు. ఆయన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత.. శేషేంద్ర శర్మ 30కి పైగా రచనలు కూడా చేశారు. 'నా దేశం-నా ప్రజలు' 2004 నోబెల్ సాహిత్య పురస్కారానికి నామినేట్ అయ్యింది. భారత ప్రభుత్వం నుంచి ‘రాష్ట్రేంద్రు’ బిరుదు, తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటు అందుకున్నారు.