ప్రతి విద్యార్థికి మెరుగైన విద్య అందించడమే ముఖ్య మంత్రి చంద్రబాబు లక్ష్యమని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని పట్టాభిపురం మున్సిపల్ హైస్కూలు, ఓరియంటల్ హైస్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు స్కూలు బ్యాగులు, పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్‌లు, బూట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని, విద్యార్థులకు వాటిని అందజేశారు. ఈ సందర్భంగా మాధవి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని తెలిపారు. ఆంధ్రప్రదేశలోని ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులు ఆకర్షితులయ్యే విధంగా విద్యా ప్రమాణాలను ఉపాధాయ్యులు పెంచాలని మాధవి కోరారు. ఇప్పుడు చదువుకునే విద్యా ర్థుల కోసం ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి తల్లికి వందనం పేరుతో చంద్రబాబు ఒక్కొక్కరికి సంవత్సరానికి రూ.15వేలు ఇవ్వనున్నారని, త్వరలోనే దానిని అమలు చేయబోతున్నామని గళ్లా మాధవి తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ రామకృష్ణ, కార్పొరేటర్ ఈరంటి వరప్రసాద్, నారా దాసు ప్రసాద్, జెట్టి బాబు, యర్రాకుల శ్రీను, కన్నసాని బాజీ తదితరులు పాల్గొన్నారు.