శ్రీకాకుళం జిల్లాలోని శ్రీముఖలింగేశ్వరస్వామి కల్యాణ మహోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి మైనాకోత్సవాన్ని దేవదాయశాఖ సిబ్బంది, అర్చకులు ఘనంగా నిర్వహించారు. పార్వతీ పరమేశ్వరుల ఉత్సవ మూర్తులను గ్రామోత్సవం నిర్వహించి జలుమూరు గ్రామం పొలిమేరలోని పాఠశాల సమీపం వద్దకు చేర్చారు. అక్కడ గడ్డితో (పరమేశ్వరుని) ఇంటిని ఏర్పాటు చేసి మైనాకోత్సవం నిర్వహించారు. పార్వతీదేవిని పరమేశ్వరుడు వివాహం చేసుకోవడం పార్వతీదేవి సోదరుడైన మైనాకుడుకి ఇష్టం లేదని, దీంతో మైనాకుడు తన సేవకులతో రాత్రివేళ పరమేశ్వరుని ఇంటికి నిప్పంటించి దహనం చేశాడని, దానినే మైనాకోత్సవం అంటారని అర్చకులు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ఈవో పి.ప్రభాకరరావు, అర్చకులు నారాయణమూర్తి, వెంకటాచలం, చైతన్య, అప్పారావు, శివ, శ్రీకృష్ణ, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.