తిరుపతి, చంద్రగిరి ప్రాంతాల్లో గంజాయి వినియోగానికి పూర్తిగా అడ్డుకట్ట వేసేందుకు పోలీసుశాఖ సిద్ధమైంది. జిల్లాలో గంజాయి విక్రయాలకు అడ్డాగా మారిన దాదాపు 49 ప్రాంతాలను గుర్తించిన పోలీసు యంత్రాంగం 100 రోజుల్లో గంజాయి వినియోగాన్ని పూర్తిగా అరికట్టడానికి యాక్షన్ ప్లాన్ రూపొందిస్తోంది.ఈ ప్రాంతాల్లో నిరంతరం నిఘా వుండేలా ప్రతి పోలీసు స్టేషన్ పరిధిలో ప్రత్యేక యాక్షన్ టీమ్‌లు ఏర్పాటు చేయనున్నారు.యువకులు, విద్యార్థులు గంజాయికి అలవాటుపడకుండా ఉండేందుకు ఉపాధ్యాయులను భాగస్వామ్యులను చేస్తూ యాంటీ డ్రగ్ కమిటీలను నియమించాలని ఎస్పీ హర్షవర్దన రాజు నిర్ణయించారు. గంజాయి, మత్తు మందుల వినియోగం వల్ల తలెత్తే సమస్యలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు కళాశాలల్లో సదస్సులు నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పోలీసులతో యాంటీ డ్రగ్ కమిటీలు ఏర్పాటు చేయనున్నారు.ఆయా కమిటీలు గంజాయి వినియోగిస్తున్న యువకులను, విద్యార్థులను గుర్తించి పోలీసులకు సమాచారం అందిస్తే వారిని డీఅడిక్షన్ సెంటర్లకు తరలించనున్నారు.