ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో శనివారం ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా చింతకాయల అయ్యన్నపాత్రుడిని ఎన్నుకున్న తర్వాత కూటమి పార్టీలకు చెందిన సభ్యులు ఆయన గురించి మాట్లాడారు. ఈ సందర్బంగా అయ్యన్నపాత్రుడి గురించి వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంతకుముందు రాజకీయ నేతగా అయ్యన్న పాత్రుడు చాలా దూకుడుగా వ్యవహరించారని, ఆ క్రమంలో కొన్ని పదునైన మాటలు కూడా మాట్లాడాల్సి వచ్చేదని అచ్చెన్నాయుడు అన్నారు. అయితే స్పీకర్‌గా ఇక తన అవతారం మార్చాల్సి ఉందని..హుందాగా ఉండాలంటూ సూచించారు. ఈ క్రమంలోనే అచ్చెన్న వ్యాఖ్యలకు డిప్యూటీ సీఎం పపన్ కళ్యాణ్ పగలబడి నవ్వుతూ కనిపించారు. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
2019-24 శాసనసభ ఏపీ చరిత్రలోనే దుర్మార్గమైన శాసనసభ అంటూ అచ్చెన్నాయుడు మండిపడ్డారు. వైసీపీ నేతలు.. టీడీపీ ఎమ్మెల్యేలను బండబూతులు తిట్టారని విమర్శించారు. సభకు రానివాళ్లు అదృష్టవంతులని అప్పట్లో బాధపడ్డామని గుర్తుచేసుకున్నారు. గత శాసనసభలో టీడీపీ ఎమ్మెల్యే మీద భౌతిక దాడులు కూడా చేశారని అన్నారు. అయితే అనుభవజ్ఞుడిగా సభను హుందాగా నడిపించాలని అచ్చెన్నాయుడు.. అయ్యన్నపాత్రుడిని కోరారు.
"ఈ రోజు వరకూ మీ అవతారం ఒకటి. ఈ రోజు నుంచి మీ అవతారం మార్చాలి. ఎందుకంటే రాజకీయాల్లో పదునైన మాటలు మాట్లాడాలి. విమర్శలకు సరైన సమాధానం చెప్పాలి. కానీ.. ఇవాళ మీరు శాసనసభాపతి. నా కోరిక ఏంటంటే.. బలహీనవర్గాలకు చెందిన చింతకాయల అయ్యన్నపాత్రుడు నాయకత్వంలో దేశానికి రోల్ మోడల్‌గా ఏపీ శాసనసభ ఎదగాలని కోరుకుంటున్నా. ఆ స్థాయికి మీరు తీసుకెళ్తారని ఆశిస్తున్నా" అని అచ్చెన్నాయుడు మాట్లాడారు. ఈ సమయంలోనే పవన్ కళ్యాణ్ నవ్వుతూ కనిపించారు.
మరోవైపు బలహీనవర్గాలకు టీడీపీ ఎంతో ప్రాధాన్యం ఇచ్చిందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఎన్టీఆర్, చంద్రబాబు బలహీనవర్గాలకు రాజకీయంగా ప్రాధాన్యం ఇచ్చారని గుర్తుచేశారు. అలాంటి బలహీనవర్గాలకు చెందిన వ్యక్తిని స్పీకర్‌గా ఎన్నుకుంటే ఆ కార్యక్రమానికి కూడా హాజరుకాని విపక్షం ఉండటం బాధగా ఉందని వైసీపీని ఉద్దేశించి అచ్చెన్నాయుడు విమర్శలు గుప్పించారు. సుధీర్ఘ రాజకీయ జీవితంలో అయ్యన్నపాత్రుడు రాజకీయంగా ఎన్నో పదవులు అలంకరించారని అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు. మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా ఏ పదవి అలంకరించినా.. ఆ పదవికే వన్నె తెచ్చారని అభిప్రాయపడ్డారు.