ఆంధ్రప్రదేశ్‌లో కొలవుదీరిన నూతన ప్రభుత్వం పాలనపై దృష్టిపెట్టింది. ఈ క్రమంలోనే మరో శుభవార్త చెప్పింది. ఇప్పటికే మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన పలువురు మినిస్టర్లు తమ శాఖలపై పట్టును పెంచుకునే పనిలో పడ్డారు. తాజాగా శనివారం ఏపీ ఇంధనశాఖ మంత్రిగా గొట్టిపాటి రవికుమార్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం.. రాష్ట్రంలో కొత్తగా 40వేల 336 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేసే ఫైల్ మీద తొలి సంతకం చేశారు. దీనితో పాటుగా గవర్నమెంట్ ఆఫీసులకు దశలవారీగా సోలార్ విద్యుత్ కనెక్షన్లు అందించే ఫైల్ మీద రెండో సంతకం చేశారు. అలాగే ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం కింద ఇంటింటికీ మూడు కిలోవాట్ల సౌర విద్యుత్ అందించే పథకంపై మూడో సంతకం చేశారు.
ఇంధనశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మాట్లాడిన గొట్టిపాటి రవికుమార్.. చంద్రబాబు తన మీద నమ్మకంతో ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తానని చెప్పుకొచ్చారు. ఏపీలో విద్యుత్ సరఫరా మీద దృష్టిపెడతానని చెప్పుకొచ్చారు. అలాగే దేశంలోనే ఉత్తమ విద్యుత్ శాఖగా ఏపీ విద్యుత్ శాఖను తీర్చిదిద్దేందుకు తన వంతు కృషి చేస్తానని మంత్రి చెప్పారు. గత ప్రభుత్వం 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి సామాన్యుడిపై భారం మోపిందన్న గొట్టిపాటి రవికుమార్.. వైసీపీ పాలనలో ఏపీలో విద్యుత్ శాఖ నిర్వీర్యమైందని మండిపడ్డారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ తొలి సంతకం పెట్టిన ఫైల్ ద్వారా.. ఏపీవ్యాప్తంగా కొత్తగా 40 వేల 336 విద్యుత్ కనెక్షన్లు ఇచ్చేందుకు వీలు కలుగుతుంది.
మరోవైపు గొట్టిపాటి రవికుమార్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2004 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మార్టూరు నుంచి కాంగ్రెస్ తరుఫున పోటీచేసిన గొట్టిపాటి రవికుమార్.. తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరుఫున బరిలోకి దిగి.. టీడీపీ అభ్యర్థి కరణం బలరామకృష్ణమూర్తిపై విజయం సాధించారు. 2014లో వైసీపీ తరుఫున అద్దంకిలో పోటీచేసిన గొట్టిపాటి రవికుమార్...మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత టీడీపీలో చేరిన రవికుమార్.. 2019. 2024 ఎన్నికల్లోనూ ఆ పార్టీ తరుఫున అద్దంకి నుంచి ఘన విజయం సాధించారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో ఇంధనశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.