ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి కోలుకుని.. తిరుగులేని రికార్డుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 23 సీట్ల నుంచి ఏకంగా 135 సీట్లకు ఎదిగి.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ గ్రాండ్ విక్టరీని ఆ పార్టీ శ్రేణులు ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఎవరికి తోచిన విధంగా, చేతనైన విధంగా వారు సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, విపక్ష నేతగా ఉన్న సమయంలో ఆయనకు జరిగిన అవమానానికి నిరసనగా 945 రోజుల పాటు ఓ వ్యక్తి నల్లచొక్కా ధరించిన వైనం వైరల్ అవుతోంది.
వీర అనే వ్యక్తి టీడీపీకి, చంద్రబాబుకు వీరాభిమాని. బెంగళూరు టీడీపీ ఫోరమ్ వ్యవస్థాపకులుగా ఉన్నారు. అయితే విపక్ష నేతగా ఉన్న సమయంలో చంద్రబాబును అప్పటి అధికార పార్టీ వైసీపీ అవమానించిందని వీర దీక్ష చేపట్టారు. చంద్రబాబును అవమానించారని ఆరోపిస్తూ నల్లచొక్కా ధరించి నిరసన ప్రారంభించారు. అటు చంద్రబాబు నాయుడు సైతం ఆరోజు సభలో శపథం చేశారు. ఈ కౌరవసభలో తాను ఉండనని.. ముఖ్యమంత్రిగా తిరిగి గౌరవసభలో అడుగుపెడతానని శపథం చేశారు. చేసిన శపథాన్ని నిజం చేస్తూ ఎన్నికల్లో ఘన విజయం సాధించి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో వీర తన దీక్షను విరమించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసిన బీటీఎఫ్ అధ్యక్షులు వీరా.. తన దీక్షను విరమించారు. సీఎం చంద్రబాబు చేతులతో పసుపు చొక్కాను స్వీకరించి.. దీక్షను విరమించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలను టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. చంద్రబాబుపై అభిమానంతో 945 రోజుల పాటు నల్లచొక్కాను ధరిస్తూ దీక్ష చేశారని.. ఇప్పుడు చంద్రబాబు సీఎం కావటంతో తన దీక్షను విరమించారంటూ టీడీపీ శ్రేణులు కొనియాడుతున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.