ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రివర్గం తొలిసారిగా జూన్ 24వ తేదీ భేటీ కానుంది. జూన్ 24వ తేదీ ఉదయం పదిగంటలకు ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం కానుంది, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుండగా.. కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలు చర్చించనున్నారు. అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టుపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నట్లు తెలిసింది.అలాగే ఏపీ ఆర్థిక పరిస్థితిపైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. సహచర మంత్రులతో చర్చించనున్నారు. అలాగే వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించి ఎనిమిది శ్వేతపత్రాలు విడుదల చేయాలని టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.
ఇక వీటితో పాటుగా ఎన్నికల సమయంలో టీడీపీ కూటమి అనేక హామీలు ఇచ్చింది. ఈ హామీల అమలుపైనా చర్చించనున్నట్లు తెలిసింది. ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలుపై చర్చించే అవకాశం ఉంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని నెలరోజుల్లో అమలు చేస్తామని ఏపీ రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఇటీవల ప్రకటించారు. 15 రోజుల్లోగా కమిటీని వేసి.. పొరుగు రాష్ట్రాల్లో అమలవుతున్న విధానంపై అధ్యయనం జరుపుతామని ఆయన తెలిపారు. కమిటీ నివేదిక సమర్పించిన అనంతరం నెలరోజుల్లో ఉచిత బస్సు ప్రయాణం హామీని అమలు చేస్తామన్నారు. ఈ నేపథ్యంలో ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలుపైనా కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది.
అలాగే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఐదు కీలక ఫైళ్లపై సంతకాలు చేశారు. మెగా డీఎస్సీ, అన్నక్యాంటీన్ల ఏర్పాటు, సామాజిక పింఛన్ల పెంపు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, నైపుణ్య గణనపై సంతకాలు చేశారు. ఈ నేపథ్యంలో కేబినెట్ భేటీలో వీటికి మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అలాగే కేబినెట్ భేటీలో చర్చించాల్సిన అంశాలపై ప్రతిపాదనలను వివిధ శాఖల నుంచి ఇప్పటికే సేకరించినట్లు సమాచారం. వీటిని క్రోడీకరించి మంత్రివర్గం సమావేశం ఎజెండాను రూపొందించనున్నారు. వీటితో పాటు వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపే అంశంపైనా ఏపీ మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఏపీ కేబినెట్ తొలి భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.