గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) 4వ వార్డు వైయస్ఆర్సీపీ కార్పొరేటర్ దౌలపల్లి కొండబాబు ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో ఆయన ఇంటి అద్దాలు పగిలిపోయాయి. చేపలుప్పాడలో కొండబాబు నివాసం ఉంటున్నారు. శుక్రవారం అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆయన ఇంటిపై రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఇంటి ఎలివేషన్ అద్దాలు పగిలిపోయాయి. రాత్రి పెద్ద శబ్దాలు రావడంతో బయటకు వచ్చి చూశానని వైయస్ఆర్సీపీ కార్పొరేటర్ కొండబాబు తెలిపారు. అదే సమయంలో కరెంటు లేకపోవడంతో ఎవరు దాడి చేశారో కనబడలేదన్నారు. వెంటనే భీమిలి పోలీసులకు సమాచారమివ్వగా ఇద్దరు కానిస్టేబుళ్లు ఘటనా స్థలానికి వచ్చారని, వారిని చూసి గుర్తు తెలియని వ్యక్తులు పరారైనట్లు తెలిపారు. శనివారం భీమిలి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. ఈ దాడులను మాజీ మంత్రులు గుడివాడ అమర్నాథ్, అవంతి శ్రీనివాసరావు ఖండించారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు అండగా ఉంటామని తెలిపారు. దాడులు చేసినవారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.