కలియుగ ప్రత్యక్ష దైవం ఆ శ్రీనివాసుడు కొలువైన తిరుమలను నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. స్వామివారిని దర్శించుకుని హుండీలలో కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. తమ స్థాయికి తగినట్లుగా ఆ శ్రీవారి హుండీలో భక్తులు కానుకలు సమర్పిస్తూ ఉంటారు. మరికొంత మంది టీటీడీ ట్రస్టుకు భారీ విరాళాలు అందించి.. శ్రీవారి భక్తులకు మరిన్ని మెరుగైన సౌకర్యాలు అందించేందుకు టీటీడీకి తోడ్పాటు అందిస్తుంటారు. ఈ క్రమంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టుకు సోమవారం భారీ విరాళం అందింది. ఝార్ఖండ్‌కు చెందిన ఓ కంపెనీ రూ.20 లక్షలు విరాళంగా అందించింది.
ఝార్ఖండ్‌కు చెందిన సరళా ఇంజినీరింగ్ లిమిటెడ్ టీటీడీ ట్రస్టులకు రూ.20 లక్షలు విరాళంగా అందించింది. ఎస్వీబీసీ ట్రస్టులకు పది లక్షల రూపాయలు, ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు పది లక్షల రూపాయల చొప్పున విరాళం అందించింది. సరళా ఇంజనీరింగ్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధి..తిరుపతికి చెంది రాఘవేంద్ర సోమవారం గోకులం విశ్రాంతి గృహంలో టీటీడీ ఈవో జె.శ్యామలరావుకు ఈ విరాళం తాలూకు డీడీలను అందించారు. ఎంతోమంది భక్తుల ఆకలి తీరుస్తున్న అన్న ప్రసాదం ట్రస్టుకు విరాళం అందించడం ఆనందంగా ఉందని సంస్థ తరుఫున ప్రతినిధి తెలిపారు.
మరోవైపు తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలలో ఏర్పాటు చేసిన హుండీల ద్వారా వచ్చిన వాచీలు, సెల్ ఫోన్లను సోమవారం వేలం వేశారు. రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ ద్వారా వివిధ బ్రాండ్లకు చెందిన వాచీలు. మొబైల్ ఫోన్లను టీటీడీ ఆన్ లైన్ ద్వారా వేలం వేసింది. హుండీల ద్వారా భక్తులు సమర్పించిన కొత్తవి లేదా ఉపయోగించిన ఫోన్లను వేలం వేశారు.మొత్తం 14 లాట్ల వాచీలు.. 24 లాట్ల మొబైల్ ఫోన్లను వేలంలో ఉంచారు.