ఆంధ్రప్రదేశ్‌లోని సముద్ర తీరాల్లో జరుగుతున్న వరుస ప్రమాదాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా బాపట్ల జిల్లాలోని బీచ్‌లలో జరుగుతున్న వరుస ఘటనలు, మరణాల నేపథ్యంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. బాపట్ల జిల్లాలో ఉన్న వేటపాలం, చీరాల బీచ్‌లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. గత వారం రోజుల వ్యవధిలో ఈ రెండు బీచ్‌లలోనే ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. సముద్ర స్నానానికి వెళ్లి గల్లంతై ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే బాపట్ల జిల్లాలోని ఈ రెండు బీచ్‌లను బాపట్ల పోలీసులు తాత్కాలికంగా మూసివేశారు. ప్రజలు అటువైపు వెళ్లకుండా బీచ్‌లోకి ప్రవేశం నిషేధించారు.
గత వారం రోజుల వ్యవధిలో ఆరుగురు చనిపోయారన్న బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్.. 14 మందిని బీచ్‌లలో ఉన్న సెక్యూరిటీ కాపాడారని చెప్పారు. ఈ సీజన్‌లో సముద్రంలో ఆటుపోట్లు ఎక్కువగా ఉంటాయని.. అందుకే జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బీచ్ చూడ్డానికి వచ్చేవారు మోకాళ్లలోతు వరకే వెళ్తున్నప్పటికీ.. వాతావరణ పరిస్థితులు, సముద్రపు ఆటుపోట్ల కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. అయితే ఎల్లప్పుడూ పోలీసులు గస్తీ కాస్తూ ఉండటం ఆసాధ్యం కావటంతో తాత్కాలికంగా బీచ్‌లను మూసివేసినట్లు చెప్పారు. బాపట్ల జిల్లాలో సుమారు 76 కిలోమీటర్ల మేర సముద్ర తీరం ఉండగా.. వారాంతాల్లో భారీగా సందర్శకులు వస్తుంటారు.
మరోవైపు ఇటీవలే రామాపురం బీచ్‌లో జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు ప్రణాలు కోల్పోయారు. 12 మంది యువకులు సముద్రస్నానానికి దిగితే నలుగురు గల్లంతయ్యారు. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో బీచ్‌లలో ప్రవేశాన్ని నిషేధించిన పోలీసులు.. సముద్రానికి వెళ్లే మార్గాలలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. సముద్ర తీరంవైపు వెళ్లొద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. సందర్శకులకు అనుమతి నిరాకరించారు.