సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ మంత్రివర్గం తొలి సమావేశం ముగిసింది. సుమారు మూడున్నర గంటల పాటు కేబినెట్ భేటీ జరిగింది. తొలి కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం చంద్రబాబు నాయుడు సంతకాలు చేసిన మొదటి ఐదు ఫైళ్లకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. మెగా డీఎస్సీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, సామాజిక భద్రతా పింఛన్లు రూ.4000లకు పెంపు, అన్న క్యాంటీన్ల ఏర్పాటు, నైపుణ్య గణన ఫైళ్ల మీద చంద్రబాబు తొలి ఐదు సంతకాలు చేశారు.
సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో.. మూడున్నర గంటలపాటు వివిధ అంశాలపై కేబినెట్ చర్చించింది. అనంతరం మెగా డీఎస్సీ, పింఛన్ల పెంపు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్ల ఏర్పాటు, స్కిల్ సెన్సన్ ప్రతిపాదనలకు ఏపీ కేబినెట్ పచ్చజెండా ఊపింది. అలాగే వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయంగా పునరుద్ధరించాలనే ప్రతిపాదనకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మెగా డీఎస్సీ కింద 16,437 పోస్టులను డిసెంబర్ పదో తేదీలోపు భర్తి చేయనున్నారు. ఇందుకోసం జులై ఒకటి నుంచి ప్రక్రియ ప్రారంభం కానుంది.
అలాగే సామాజిక భద్రతా పింఛన్లు రూ. నాలుగువేలకు పెంచారు. జులై నెలలో ఏప్రిల్, మే, జూన్ నెల బకాయిలు మూడు వేలు కలిపి మొత్తం రూ,7000 పింఛన్ అందివ్వనున్నారు. అలాగే వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా పేరు మార్చాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైసీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా మార్చారు. అయితే అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ పేరును పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకుంది.
మరోవైపు కేబినెట్ భేటీ తర్వాత మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం అయ్యారు. ఈ సారి మంత్రివర్గంలో 17 మంది తొలిసారిగా మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. అందులోనూ తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచినవాళ్లే ఎక్కువగా ఉన్నారు. ఈ నేపథ్యంలో శాఖల నిర్వహణ, ప్రభుత్వ ప్రాధాన్యాలపై సీఎం చంద్రబాబు వారికి వివరించినట్లు తెలిసింది.