మెగా డీఎస్సీ, సామాజిక పింఛను రూ.4వేలకు పెంపు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన... ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన వెంటనే పెట్టిన ‘ఐదు తొలి సంతకాల’ అమలుకు రంగం సిద్ధమైంది. కొత్త ప్రభుత్వ తొలి కేబినెట్ సమావేశంలోనే కీలక నిర్ణయాలపై ఆమోద ముద్ర పడింది. ఆంధ్రప్రదేశ్‌పై ‘గంజాయి రాజధాని’గా పడిన ముద్ర తొలగించాలని ప్రభుత్వం సంకల్పించింది. గంజాయితోపాటు మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించింది. దీనికోసం ఐదుగురు మంత్రులతో కమిటీని నియమించింది. పెంచిన వృద్ధాప్య పింఛన్లను జూలై 1 నుంచి సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటి వద్దే పంపిణీ చేయించాలని నిర్ణయం తీసుకుంది. పోలవరం, అమరావతి సహా ఏడు అంశాలపై ఏడు శ్వేతపత్రాలను విడుదల చేయాలని నిశ్చయించింది. సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ‘కూటమి’ సర్కారు తొలి కేబినెట్ భేటీ జరిగింది. ఆ వివరాలను సమాచారశాఖ మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వివరించారు. వైసీపీ హయాంలో రాష్ట్రంలో గంజాయి, మాదకద్రవ్యాల వినియోగం విపరీతంగా పెరిగిపోయిందనీ, కళాశాలలు, పాఠశాలలను కూడా ఈ మహమ్మారి వదిలిపెట్టలేదని కొలుసు అన్నారు. దీని నివారణకు చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోనుందని తెలిపారు. ‘‘రాష్ట్రంలో గంజాయి నియంత్రణకు తగు సూచనలు చేసేందుకు హోమ్,గిరిజన సంక్షేమం, విద్యాశాఖ, ఎక్సైజ్, వైద్యఆరోగ్యశాఖలకు చెందిన మంత్రులతో కమిటీని ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది’’ అని ఆయన తెలిపారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును పునరుద్ధరిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ‘‘గత వైసీపీ ప్రభుత్వం వైఎ్‌సఆర్ హెల్త్ యూనివర్సిటీగా దాని పేరు మార్చింది.