ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ముసునూరు మండలంలోని పలు గ్రామాల్లో పొలాల్లోని వ్యవసాయ బోర్ల కేబుల్, ఇతర సామగ్రిని దుండగులు అపహరించుకుపోతున్నారు. తాజాగా చింతలవల్లిలో మంగళ, బుధవారాల్లో సూమారు 15 వ్యవసాయ బోర్లుకు సంబంధించిన సామగ్రి చోరీకి గురైంది. బోరు దగ్గర నుంచి సుమారు 20 మీటర్ల పొడవున్న కేబుల్ వైర్, ఫ్యూజుల్లో రాగివైర్, స్టార్టర్లలోని రాగివైర్లు సైతం చోరీకి గురికావడంతో పల్లిపాము సుగుణరావుతోపాటు మరికొంతమంది రైతులు ముసునూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒక బోరుకు సంబంధించిన సామగ్రి విలువ రూ. 10 వేల నుంచి 15 వేలు వరకు ఉంటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కొద్ది నెలలుగా ముసునూరు, గోపవరం, తాళ్ళవల్లి, చెక్కపల్లి, కొర్లకుంట తదితర గ్రామాల్లో ఈ చోరీలు జరగడంతో బాధిత రైతులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసులు కూడా నమోదయ్యాయి. అయితే దొంగల ఆచూకీ లభ్యం కాలేదు. చోరీలు కొనసాగుతూనే ఉన్నాయని రైతు లు వాపోతు న్నారు. ఈ విధంగా వ్యవసాయ బోర్లు కేబుల్, సామగ్రి చోరీకి గురైతే భవిష్యత్‌లో వ్యవసాయం చేయలేమని రైతులు అంటున్నారు. ఇప్పటికైన ఈ చోరీలను నియంత్రించేలా పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని మండల రైతాంగం కోరుతోంది.