‘రాష్ట్రంలో మరెక్కడా నేను దృష్టి పెట్టకుండా కుప్పంలోనే నన్ను లాక్ చేసేందుకు కుట్ర పన్నారు. అందుకే ఇక్కడ ఓటుకు రూ.5 వేలు పంచారు. కొంతమంది టీడీపీ నాయకులను మభ్య పెట్టారు. అయినా పట్టించుకోకుండా రాష్ట్రమంతటా తిరిగాను. అందుకే కుప్పంలో ఆశించిన మెజారిటీ రాలేదు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సొంత నియోజకవర్గం కుప్పంలో ఆయన రెండ్రోజుల పర్యటన బుధవారం ముగిసింది. ఉదయం అర్‌అండ్‌బీ అతిథిగృహంలో ప్రజల నుంచి ఆయన అర్జీలు స్వీకరించారు. తర్వాత నియోజకవర్గంలోని అధికారులతో, టీడీపీ శ్రేణులతో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు కుప్పం నియోజకవర్గం నుంచే శ్రీకారం చుడతాను. సింపుల్ గవర్నమెంట్.. సమర్థ ప్రభుత్వం (ఎఫెక్టివ్ గవర్నెన్స్) నా విధానం. దీనికి అనుగుణంగా అధికారులు పనిచేయాలి. గత ప్రభుత్వ పాలనకు, ఇప్పటికి చాలా వ్యత్యాసం ఉంటుంది. అధికారులు ఫిజికల్‌గా, వర్చువల్‌గా పనిచేసేందుకు సిద్ధపడండి. బలవంతపు జనసమీకరణతో పెద్ద సమావేశాలు, భారీ కాన్వాయ్ హంగామా ఈ ప్రభుత్వంలో ఉండవు. సాయంత్రం 6 తర్వాత సమావేశాలు వద్దని మంత్రులకు చెప్పాను. కుప్పం సమగ్ర అభివృద్ధికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయండి. ఇక్కడ రౌడీయిజం, హింస, గంజాయి, అక్రమాలు కనిపించకూడదు. రాజకీయ ప్రోద్బలంతో గత ప్రభుత్వ హయాంలో పెట్టిన కేసులను ఎత్తేయండి. గత ఐదేళ్లలో కొందరు అధికారులు మనసు చంపుకొని పనిచేశారు. మరికొందరు వైసీపీ నేతలకు సహకరించారు. నా సొంత నియోజకవర్గానికి రాకుండా నన్ను అడ్డుకున్నారు. నాపైనా హత్యాయత్నం కేసు పెట్టారు’ అని గుర్తుచేశారు.