కృష్ణపట్నం పోర్టు కంటైనర్ టెర్మినల్‌ను పునరుద్ధరించాలనే లక్ష్యంతోనే ఉన్నామని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లాలోని అదానీ కృష్ణపట్నం పోర్టులో శుక్రవారం ఎన్డీయే కూటమి, వామపక్ష నేతలతో కలసి వెళ్లి పోర్టు సీఈవో జీజే రావును కలిశారు. అనంతరం సోమిరెడ్డి మాట్లాడారు. ‘మూసివేసిన కృష్ణపట్నం పోర్టు కంటైనర్ టెర్మినల్‌ను కొనసాగించాలి. టెర్మినల్ మూసివేతతో నెల్లూరు, రాయలసీమ, ప్రకాశం, గుంటూరు జిల్లాల నుంచి బియ్యం, చేపలు, రొయ్యలు, మొక్కజొన్న, పొగాకు, మిర్చి, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు ఆగిపోయాయి. సీవీ రావు హయాంలోనే 10 లక్షల కంటైనర్ ట్రాన్స్‌పోర్టు జరిగితే, ఇక అదానీ చేతికి వస్తే 20 లక్షల కంటైనర్ పోతుందని భావించాం. పోర్టు ఇలా మునిగిపోతుందని కలలో కూడా ఊహించలేదు. అదానీని ఒప్పించి కంటైనర్ టెర్మినల్‌ను పునరుద్ధరించే సామర్థ్యం సీఈవోకి ఉంది. పోర్టును నమ్ముకున్న మా ప్రాంత ప్రజలు, యువత కోసం అవసరమైతే అదానీ కాళ్లు పట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని సోమిరెడ్డి అన్నారు.