ఏపీఎస్‌ఆర్టీసీ మరోసారి ప్రశంసలు అందుకుంది.. ఓ సామాన్యుడు ఇచ్చిన ఫిర్యాదుపై కేవలం 5 గంటల వ్యవధిలోనే స్పందించి శభాష్ అనిపించుకుంది.. ఇప్పుడు ఆ ట్వీట్ వైరల్ అవుతోంది. పల్నాడు జిల్లా సత్తెనపల్లి ప్రాంతానికి చెందిన ఓ యువకుడు ఆర్టీసీ బస్సు సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఫిర్యాదు చేశారు. 'నేను మా నాయనమ్మ కోసం బస్సు ఆపమని చెయ్యి ఎత్తాను.. బస్సు డ్రైవర్ బస్సును ఆపకుండా వెళ్లిపోయాడు.. వెంటనే నేను ఆ బస్‌ను ఆ తర్వాతి బస్ స్టాప్ వరకు ఛేజ్ చేశాను. బస్సును ఎందుకు ఆపలేదని డ్రైవర్‌ను అడిగాను. ఆ డ్రైవర్ స్పందించి.. పెద్ద వయసువాళ్ల కోసం ఈ బస్సును ఆపడం కుదరదు.. వాళ్లు బస్సు ఎక్కేందుకు ఎక్కువ సమయం తీసుకుంటారని నాతో చెప్పారు. అంటే ఆర్టీసీ బస్సు పెద్ద వయసువాళ్ల కోసం కాదా?' అంటూ ఆ నెటిజన్ ప్రశ్నించారు.
ఫిర్యాదుతో పాటుగా బస్సు నంబర్, వివరాలతో ఫోటోను కూడా ట్వీట్ చేశారు.. ఆర్టీసీని ట్యాగ్ చేశారు. ఆ వెంటనే ఆర్టీసీ స్పందించింది.. ఈ ఫిర్యాదుపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పింది. వెంటనే ఆ బస్సు సిబ్బంది (డ్రైవర్, కండక్టర్)ని పిలిపించింది.. వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు డిపో మేనేజర్. ఈ విషయాన్ని ఎక్స్ (ట్విట్టర్) ద్వారా తెలియజేశారు. 'ఈ నెల 28న మీ కుటుంబ సభ్యులకు జరిగిన అసౌకర్యానికి చింతుస్తున్నాము.. ఈ విషయమై AP07Z0181 బస్సు సిబ్బంది అయిన వలి డ్రైవర్, కోటయ్య కండక్టర్లను పిలిచి కౌన్సిలింగ్ చేసి, హెచ్చరించి.. ప్రయాణికులు చేయి ఎత్తిన చోట బస్సు ఆపి, కోరిన చోట దించాలని ఆదేశాలు ఇచ్చాము. ఈ విషయమై ప్రతి ఒక్క సిబ్బంది కూడా ప్రయాణికులు చెయ్యి ఎత్తిన చోట బస్సు ఆపి, కోరిన చోట దించాలని గేటు మీటింగ్ ద్వారా తెలియజేశాము'అంటూ రిప్లై ఇచ్చారు. అలాగే డిపో మేనేజర్ ఆ బస్సు సిబ్బందికి కౌన్సిలింగ్ ఇచ్చిన ఫోటోను కూడా ట్వీట్‌తో పాటుగా జత చేసింది ఆర్టీసీ.
ఓ సామాన్యుడి ఫిర్యాదుపై ఆర్టీసీ వెంటనే స్పందించి చర్యలు తీసుకోవడంపై నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ బాధ్యతగా వ్యవహరించిందని.. ఇది మంచి పరిణామం అంటున్నారు. ఫిర్యాదు చేసిన కొన్ని గంటల్లోనే స్పందించి తగిన చర్యలు తీసుకోవడం ఆనందంగా ఉందంటున్నారు. గతంలో కూడా ఎంతోమంది ప్రయాణికులు, నెటిజన్లు చేసిన ఫిర్యాదులపై సకాలంలో స్పందించి చర్యలు తీసుకుంది ఆర్టీసీ. ఇప్పుడు మరోసారి ఎక్స్ వేదికగా మరో ఫిర్యాదుపై చర్యలు తీసుకుంది. అంతేకాదు ఈ ట్వీట్ బాగా వైరల్ అవుతోంది.