ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటైన కొత్త ప్రభుత్వం.. ఎన్నికల హామీలను నెరవేర్చే పనిలో ఉంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు హామీలకు సంబంధిం మొత్తం ఐదు సంతకాలు చేశారు. మెగా డీఎస్సీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పింఛన్ల పెంపు , అన్న క్యాంటీన్ల ఏర్పాటు, నైపుణ్య గణన ఫైల్స్‌పై సంతకాలు చేశారు. అయితే ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా నైపుణ్య గణన ( స్కిల్ సెన్సెస్) చేపట్టేందుకు సిద్ధమైంది.. రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికి వెళ్లి నైపుణ్య గణన చేసేందుకు కసరత్తు చేస్తోంది ప్రభుత్వం.
దేశంలోనే తొలిసారి ఆంధ్రప్రదేశ్‌లో నైపుణ్య గణన చేపడుతున్నారు. ఈ పక్రియలో భాగంగా నిరుద్యోగులు ఏం చదువుకున్నారు? ఏ పని చేస్తున్నారు? వారి నైపుణ్యాలేంటి? వంటి వివరాలను నమోదు చేస్తారు. ఒకవేళ ఎవరైనా తక్కువ ఆదాయం పొందుతుంటే.. వారి ఆదాయాన్ని పెంచే దిశగా అవసరమైన శిక్షణ ఇస్తారు. ఈ నైపుణ్య గణనను గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ద్వారా చేయించబోతున్నారు.. అలాగే ఈ సర్వేను ఆన్‌లైన్‌లో చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. స్కిల్ సెన్సెస్ ద్వారా సేకరించిన వివరాలను ఆధార్‌తో అనుసంధానం చేస్తారు. ఈ నైపుణ్య గణన కోసం ఓ ప్రత్యేక యాప్ రూపొందించాలని భావిస్తున్నారు.
రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ లెక్కల ప్రకారం రాష్ట్రంలో మొత్తం 15 లక్షల వరకు నిరుద్యోగులు ఉన్నట్లు తెలుస్తోంది. యాప్ ద్వారా వీరందరి పూర్తి వివరాలు సేకరించిన తర్వాత.. ఈ డేటా మొత్తాన్ని క్రోడీకరిస్తారు. ఈ నైపుణ్య గణన ద్వారా ఒక్కో కుటుంబానికి, ఒక్కో వ్యక్తికి ఆధార్‌లా ఓ శాశ్వతమైన నంబరు కేటాయించాలని భావిస్తున్నారు. వీరందరికి ఆన్‌లైన్‌లోనే పరీక్ష నిర్వహించి నైపుణ్యాలు గుర్తించాలని భావిస్తోంది చంద్రబాబు సర్కార్. రాష్ట్రవ్యాప్తంగా ఈ సర్వే పూర్తి చేసిన తర్వాత కంపెనీలు, పరిశ్రమలు ఎలాంటి నైపుణ్యాలు కోరుకుంటున్నాయో ప్రభుత్వం గుర్తిస్తుంది.
రాష్ట్ంరలో నిరుద్యోగులకున్న నైపుణ్యాలు, పరిశ్రమల అవసరాలకు తగిన విధంగా నిరుద్యోగులకు శిక్షణను అందిస్తారు. రాష్ట్రంలో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు.. వారికి ఎలాంటి శిక్షణ ఇవ్వాలి? అనే అంశాలపై ఈ సర్వే ఆధారంగా ప్రభుత్వానికి ఓ స్పష్టత వస్తుంది. మొన్నటి వరకు ఏదో ఒక సబ్జెక్టు, సాంకేతికతపైనే శిక్షణను ఇచ్చేవాళ్లు. ఇప్పుడు నైపుణ్య శిక్షణకు కేంద్రంలోని సెక్టార్‌స్కిల్ కౌన్సిలర్లను వినియోగించుకోవాలనే ఆలోచనలో ఉంది ప్రభుత్వం. ఎలక్ట్రానిక్స్, ఐటీ సెక్టార్, ఆటోమోటివ్, వ్యవసాయం, బ్యూటీ-వెల్‌నెస్, ఫర్నీచర్-ఫిట్టింగ్, పవర్ సెక్టార్, ఆహార పరిశ్రమ సామర్థ్యం వంటి అన్ని రంగాల్లోనూ నైపుణ్య శిక్షణకు సంబంధించిన మెటీరియల్ కేంద్ర సెక్టార్ స్కిల్ మండళ్ల దగ్గర ఉంది.
రాష్ట్రవ్యాప్తంగా నైపుణ్య గణన కోసం మూడు నెలలు సమయం పట్టొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. సర్వే పూర్తి చేసిన తర్వాత ఓ అంచనాకు రానున్నారు.. ఆ తర్వాత ప్రత్యేక నైపుణ్య శిక్షణ ప్రణాళికలను రూపొందించనుంది ప్రభుత్వం. ఆ మేరకు విద్యార్థులకు విద్యాసంస్థల్లోనే నైపుణ్యాలు అందించే దిశగా ఆలోచన చేస్తున్నారు. దీని కోసం బీటెక్, డిగ్రీ సిలబస్‌లోనూ అవసరమైన మార్పులు చేయాలని భావిస్తున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించేందుకు దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఎలాంటి నైపుణ్యాలు అందిస్తున్నారనే అంశాలపై అధ్యయనం చేయనున్నారు.