ఏపీలో వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణశాఖ. ఉత్తర ఒడిశా తీరం సమీపంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది.. అలాగే రుతుపవనాల ప్రభావంతో వానలు పడుతున్నాయి. ఇవాళ అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, నంద్యాల, కడప, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర హోం & విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున లొతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గోదావరి, కృష్ణా నదీ పరివాహాక జిల్లాల్లో క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడూ వరద ప్రవాహాన్నిపరిశీలిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.విపత్తుల నిర్వహణ సంస్థ ద్వారా ప్రాణ,ఆస్తి నష్టాన్ని వీలైనంత తగ్గించాలన్నారు.విపత్తుల సంస్థలోని ఏపీ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్‌ను స్వయంగా పరిశీలించారు.
ఒకవేళ సమస్యలు ఏమైనా ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు హోంమంత్రి. సహాయక చర్యల కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని అధికారుల్ని ఆదేశించారు. ఐఎండీ అంచనాల ప్రకారం నైరుతి రుతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటున్నారు.. లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచనలు చేశారు. జూన్ నెలలో ఇప్పటివరకు 12 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం, 9 జిల్లాల్లో అధికం, 5 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. గురువారం, శుక్రవారం వరకు అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురిశారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు, సంభవించే వరదలపై కూడా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మరోవైపు అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వ్యాలీ 66.4 మిల్లీ మీటర్లు, శ్రీకాకుళం జిల్లా మందసలో 64.2, కాకినాడ జిల్లా తునిలో 60.4, పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో 47.8, శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో 47.2, విజయనగరం జిల్లా పూసపాటిరేగలో 46.4, పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టంలో 42.2, విజయనగరంలో 38.2, పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురంలో 35.8, శ్రీకాకుళం జిల్లా కళింగపట్నంలో 35.6, పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలసలో 34.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.