ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ వీడియోను చూసి పడి, పడి నవ్విన చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 29, 2024, 09:07 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడూ సీరియస్‌గా కనిపిస్తుంటారు. ఆయన నవ్వే సందర్భాలు తక్కువగానే ఉంటాయి.. అలాంటిది చంద్రబాబు పడి, పడి నవ్వారు.. ఓ వీడియోను చూసి నవ్వును ఆపుకోలేకపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అబ్బా.. చంద్రబాబు ఎన్నాళ్లకు నవ్వారూ అంటూ తెలుగు తమ్ముళ్లు చర్చించుకున్నారు. సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొన్ని వీడియోలను ప్రదదర్శించారు.


శ్వేతపత్రం విడుదల చేసిన తర్వాత.. గత ప్రభుత్వంలో నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు వీడియోను ప్లే చేశారు. ఆ వీడియోను చూసిన చంద్రబాబు నవ్వును ఆపుకోలేకపోయారు. ఆ వీడియోలో.. ‘పోలవరం ప్రాజెక్ట్ అనేది వెరీ వెరీ కాంప్లికేటెడ్. అంత తేలికగా అర్థం కాదు. ఏంటి అర్థం కాదని చెబుతున్నానంటే.. అవును నాకు అర్థం కాలేదు కాబట్టే చెబుతున్నాను. నేను అనేకసార్లు ప్రాజెక్ట్ విజిట్ చేసి, స్టడీ చేసి, అనేకమంది సలహాదారులతో మాట్లాడిన తర్వాత ఇది ఇప్పట్లో అయ్యే ప్రాజెక్ట్ కాదని నేను నిర్ణయం తీసుకున్నాను. ఈ మాట చెప్పిన మొదటి వ్యక్తిని నేనే’ అన్నారు అంబటి రాంబాబు. అంబటి రాంబాబు వీడియోను చూసి చంద్రబాబు పడి, పడి నవ్వేశారు.. పగలబడి నవ్వారు. ఆ పక్కనే పక్కనున్న మంత్రులు కూడా నవ్వుకున్నారు. పోలవరం ప్రాజెక్ట్ అంటే ఎంత హాస్యమైందో చూడండి అన్నారు సీఎం.


టీడీపీ ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్ట 72 శాతం పనులు పూర్తి చేస్తే...వైఎస్సార్‌సీపీ 3.84 శాతం మాత్రమే పూర్తి చేసింది అన్నారు చంద్రబాబు. దీనికి తోడు నిధుల కొరత కూడా తీసుకొచ్చారని.. టీడీపీ హయాంలో రాష్ట్ర నిధులు ఖర్చు చేసి రీయింబర్స్ చేయించామని.. గత వైసీపీ ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన నిధులు కూడా ప్రాజెక్టు కోసం ఖర్చు చేయకుండా రూ.3,385 కోట్లు దారి మళ్లించిందన్నారు. టీడీపీ హయాంలో వచ్చిన గిన్నిస్ రికార్డుకు కేంద్రం కూడా ప్రశంసలు కురిపిస్తే..వైసీపీ హయాంలో నిపుణులు, పీపీఏ చివాట్లు పెట్టే పరిస్థితికి తీసుకొచ్చారన్నారు. 45.72 మీటర్ల ఎత్తుతో ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపడితే...వైసీపీ ప్రభుత్వం 41.15 మీటర్లకు కుదించిందన్నారు. రూ.55,548 కోట్లకు కేంద్రంతో ఆమోదం తెలిపేలా తాము కృషి చేస్తే...గత ప్రభుత్వం అసలు నిధులు కూడా అడగలేదన్నారు


పోలవరం నిర్వాసితులకు జగన్ ఎన్నో హామీలు ఇచ్చి మోసం చేశారన్నారు చంద్రబాబు. పరిహారం ఎకరాకు రూ.19 లక్షలు ఇస్తానన్నారని.. పరిహారం అందిన వారికి కూడా రూ.5 లక్షలు అదనంగా ఇస్తానన్నారన్నారు. పరిహారం ఇవ్వకపోవడమే కాకుండా నిర్వాసితుల జాబితాలు మార్చి పరిహారం కాజేశారని ధ్వజమెత్ారు. సకల వసతులతో కాలనీలు నిర్మిస్తానని చెప్పి ఒక్క ఇల్లు కూడా కట్టలేదని.. అధికారం, ఓట్ల కోసం ఎన్ని అబద్ధాలు చెప్పాలో అన్నీ చెప్పారన్నారు. పునరావాసానికి రూ.4,114 కోట్లు టీడీపీ ప్రభుత్వం ఖర్చు చేసి మోడల్ కాలనీలు నిర్మిస్తే...వైసీపీ ప్రభుత్వం రూ.1687 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు.


టీడీపీ హయాంలో ఐదేళ్లు పడిన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరైందన్నారు చంద్రబాబు. ప్రజలకు వాస్తవాలన్నీ తెలియకుండా దాచి పెట్టారని.. కాఫర్ డ్యాం, డయాఫ్రం వాల్, గైడ్ బండ్ తో పాటు అన్ని చోట్లా సమస్యలు సృష్టించారన్నారు. ప్రజలంతా అర్థం చేసుకోవాలి...ప్రాజెక్టు సర్వనాశనానికి జగన్ దుస్సాహసమే కారణమన్నారు. అర్హత లేని వాళ్లకు అధికారం ఇస్తే ఇలానే జరుగుతుందని.. కాఫర్ డ్యాంకు, డయాఫ్రం వాల్ కు తేడా తెలియకుండా.. ప్రాజెక్టు దగ్గరకెళ్లి కాఫర్ డ్యాం ఎక్కడుందో వెతుక్కునే వ్యక్తులు విమర్శలు చేస్తున్నారన్నారు. ప్రాజెక్టులో పైకి తెలిసిన డ్యామేజీ కంటే... తెలియని డ్యామేజీ చాలా ఉందన్నారు. 2021లోనే ప్రాజెక్టు దెబ్బతిన్నప్పటికీ 2022లో పూర్తి చేస్తామని.. 2023 నాటికి పూర్తి చేస్తాం అని చెప్పారన్నారు. డయాఫ్రం వాల్ కు కనీసం రెండు సీజన్ల సమయం పడుతుందని అధికారులు చెప్పినదాన్ని బట్టి తెలుస్తోందన్నారు. పోలవరం ప్రాజెక్టుకు ఈ దుస్థితి రావడానికి ప్రధాన దోషైన జగన్ ను ప్రజలు ఇంటికి పంపారన్నారు. రాజకీయాల్లో ఉండటానికి అర్హత లేని వ్యక్తి జగన్.. అలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండకూడదనే ప్రజలు కూటమికి ఘనవిజయాన్ని ఇచ్చారన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com