కలియుగ వైకుంఠం తిరుమలలో విశాఖ శ్రీశారదా పీఠం నిర్మిస్తున్న భవనం వివాదాస్పద మారింది. దీనిపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తిరుమలలో విశాఖ శ్రీశారదా పీఠం భవనాన్ని అక్రమంగా నిర్మిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ సాధుపరిషత్తు అధ్యక్షుడు, ఆనందాశ్రమ పీఠాధిపతి స్వామి శ్రీనివాసానంద సరస్వతి ఇటీవల ఆరోపించారు. ఈ స్వామీజీతో పాటుగా పలువురు ఇది అక్రమ నిర్మాణమని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై టీటీడీ స్పందించింది. దీనిపై ఓ ప్రకటన విడుదల చేసింది.
శ్రీశారదా పీఠానికి 30 ఏళ్లపాటు స్థలం లీజుకు ఇచ్చినట్లు టీటీడీ తెలిపింది. శ్రీ శారదా పీఠం తిరుమలలో మఠం నిర్మించుకోవడానికి 5000 చదరపు అడుగుల స్థలాన్ని లీజుకు ఇచ్చినట్లు తెలిపింది. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు సేవలందించేందుకు 2005 ఫిబ్రవరిలో 30 సంవత్సరాల పాటు స్థలం లీజుకు ఇవ్వడానికి టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయించినట్లు తెలిపింది. శ్రీ శారదా మఠానికి పక్కనే ఉన్న 4,817 చదరపు అడుగుల స్థలాన్ని మఠం అధికారులు వినియోగించుకుంటున్నారని తెలిపింది. 2019 లో ఈ అదనపు స్థలాన్ని క్రమబద్ధీకరించి, అదనపు గదులు నిర్మించడానికి అనుమతించిన అంశాన్ని ప్రభుత్వానికి తెలియజేసినట్లు తెలిపింది. మరోవైపు ప్రస్తుతం ఈ అంశం హైకోర్టు పరిధిలో ఉందని టీటీడీ ప్రకటన విడుదల చేసింది.
అయితే టీటీడీ నాలుగు అంతస్తులు వేసుకోవడానికి మాత్రమే అనుమతి ఇస్తే.. శారదాపీఠం ఆరు అంతస్తులు నిర్మిస్తోందని పలువురు అభ్యంతరం తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే శ్రీ శారదా పీఠం భవంతిని శ్రీనివాసానంద సరస్వతి ఇటీవల పరిశీలించారు. పలువురు సాధువులతో కలిసి శుక్రవారం భవనాన్ని పరిశీలించారు. వాగును ఆక్రమించి భవనాన్ని కడుతున్నారని.. భవిష్యత్తులో వరదలు వచ్చి ఏమైనా అనర్థం జరిగితే ఆ మచ్చ వెంకటేశ్వరస్వామి మీద పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమంగా నిర్మిస్తోన్న భవంతిని కూల్చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.