ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హిందువులంటే ఆర్ఎస్‌ఎస్, బీజేపీ వాళ్లు మాత్రమే కాదు.. లోక్‌సభలో రాహుల్ వర్సెస్ మోదీ

national |  Suryaa Desk  | Published : Mon, Jul 01, 2024, 10:37 PM

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై మాట్లాడిన ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ... ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లపై విరుచుకుపడ్డారు. ‘హిందువులంటే ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్లే కాదని.. సభలో ఉన్నవారు, బయట ఉన్నవారు అంతా హిందువులేనని, ఒక్క మోదీయే కాదు’ అని దుయ్యబట్టారు. ప్రతిపక్షంలో ఉన్నందుకు తాను సంతోషంగా ఉన్నానని, గర్వపడుతున్నానని అన్నారు. కొందరికి ఒక చిహ్నం అంటే భయమని, అదే అభయహస్తం కాంగ్రెస్ గుర్తుని అన్నారు. బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగంపై దాడి చేస్తోందని, దీనిని అడ్డుకుని తాము అండగా నిలబడతామని రాహుల్ గాంధీ తేల్చి చెప్పారు.


హిందూ మతం పేరుతో బీజేపీ అందరినీ భయపెడుతోందని దుయ్యబట్టారు. ఏ మతమైనా మనుషులకు ధైర్యం ఇస్తుందని, కొందరు తమను తాము హిందువులుగా ప్రచారం చేసుకుంటూ విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు. అలాంటి వాళ్లు అసలు హిందువులే కాదని, హింసను ప్రేరేపించే వాళ్లను హిందువులు అని ఎలా అనగలమని ప్రశ్నించారు. శివుడి వెనుక త్రిశూలం ఉంటుందని, ఇంది హింసకు ప్రతీక కాదు.. అదే అయితే కుడిచేతిలో ఉండేదని అన్నారు. ఈ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ అభ్యంతరం వ్యక్తం చేశారు. రాహుల్ ప్రసంగాన్ని అడ్డుకున్న ఆయన.. హిందువులంతా హింసావాదులే అన్నట్టుగా మాట్లాడడం చాలా తీవ్రంగా పరిగణించాల్సిన విషయమని మోదీ మండిపడ్డారు.


‘‘ఇప్పటి వరకూ ప్రధాని మోదీ మణిపూర్‌కు వెళ్లలేదని, మణిపూర్ కూడా మనదేశంలో భాగమని, ఒక్కసారి అక్కడకు వెళ్లి పరిస్థితి చూడండి.. మోదీతో దేవుడు నేరుగా మాట్లాడుతాడు.. నోట్ల రద్దు సలహాను కూడా మోదీకి దేవుడే పంపాడేమో.. అదానీ నుంచి ఒక్క మెసేజ్ వస్తే అన్నీ పనులూ చకచకా జరిగిపోతాయి.. నిజం చెప్పాలంటే అంబానీ, అదానీ చట్టాలే అమలవుతున్నాయి. వ్యవసాయ చట్టాలపై. రైతులు ఉద్యమం చేస్తే వారితో ప్రధాని మాట్లాడలేదు.. పైగా వారిని ఉగ్రవాదులుగా చిత్రీకరించారు.. 700 మంది రైతులు చనిపోయారు.. రైతులు మద్దతు ధర కావాలంటున్నారు.. రుణమాఫీ చేయమని కోరుతున్నారు.. కానీ, వారి కోరికలు ఏవీ నెరవేరలేదు..


దేశానికి వెన్నెముక అయిన యువతను ఉద్యోగాలు ఇవ్వకుండా వారి వెన్ను విరిచారు.. ప్రొఫెషనల్ ఎగ్జామ్ నీట్‌ను కూడా కమర్షియల్‌గా మార్చేశారు.. రాష్ట్రపతి ప్రసంగంలో నీట్ ప్రస్తావన లేదు.. నీట్‌పై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా లేదు.. నీట్‌తో పేద పిల్లలకు వైద్య విద్య దూరమయ్యిందని, ఇది కేవలం ధనవంతుల పిల్లల కోసమే’’ అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అంతేకాదు, వచ్చే ఎన్నికల్లో గుజరాత్‌లో బీజేపీని ఓడించి తీరుతామని, రాసిపెట్టుకోవాలని రాహుల్ గాంధీ శపథం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com