పేదల గృహ నిర్మాణం కోసం ఉచితంగా ఇసుక ఇవ్వాలని సర్కారు భావిస్తోంది. ఇందుకు అవసరమైన విధివిధానాలను రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. 2014-19 కాలంలో ఇసుక విధానం ఎలా ఉంది.. పేదలకు ఎలాంటి మేలు జరిగింది.. 2019-24(మే) వరకు ఇసుక అమ్మకాల విధానం ఎలా ఉంది.. ఎవరు లబ్ధిపొందారు.. ప్రభుత్వానికి జరిగిన నష్టం.. పేదలు, గృహ నిర్మాణరంగానికి జరిగిన నష్టమెంతో అంచనా వేయాలని ఆదేశించారు. మంగళవారమిక్కడ సచివాలయంలో గనుల శాఖ ఉన్నతాధికారులతో ఆయన ఇసుకపై సమీక్ష జరిపారు. జగన్ పాలనలో ఇసుక పాలసీ వల్ల పేదలు తీవ్రంగా నష్టపోయారని, గృహనిర్మాణ రంగం కుదేలైందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇసుక డంప్‌లు వైసీపీ నేతలు, ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్నాయన్న సమాచారం ఉందని, ధరలను భారీగా పెంచి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని సీఎం పేర్కొన్నట్లు తెలిసింది. తక్షణమే ఇసుక ధరలు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టంచేశారు. ఈ సందర్భంగా రీచ్‌లు, స్టాక్‌పాయింట్లు, డంప్‌ల పరిధిలో ఎంత ఇసుక అందుబాటులో ఉందని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతానికి దాదాపు 40 లక్షల టన్నులు అందుబాటులో ఉందని అధికారులు నివేదించినట్లు తెలిసింది.
![]() |
![]() |