నిరుద్యోగ అభ్యర్థుల ఆకాంక్షలకు అనుగుణంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ ప్రకటించింది. ఉపాధ్యాయ నియామకాలు చేపట్టేందుకు జిల్లా విద్యాశాఖ కసరత్తు దాదాపు కొలిక్కి వచ్చింది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పాఠశాల విద్యాశాఖతోపాటు, గిరిజన, సాంఘిక, వెనుకబడిన తరగతులు తదితర సంక్షేమ శాఖల యాజమాన్యాల్లోని పాఠశాలలు, గురుకులాలు, మోడల్ స్కూల్స్‌లో ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ కేడర్లలో మొత్తం 1067 ఉపాధ్యాయ నియామకాలకు కూటమి ప్రభుత్వం ఇటీవల గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన విషయం విదితమే. ఆ మేరకు పాఠశాల విద్యాశాఖలో మంగళవారం సాయంత్రం వరకు అన్ని కేడర్లలో కలిపి మొత్తం 725 వేకెన్సీలను గుర్తించారు. మిగతా 342 ఖాళీలను సంక్షేమ శాఖల యాజమాన్యాల్లోని పాఠశాలల్లో భర్తీ చేసేందుకు అవకాశం ఉంది. ఈ సంఖ్యల్లో కొద్దిపాటి మార్పులతో దాదాపు తుదిగా భర్తీచేసే పోస్టులు యాజమాన్యాలవారీగా ఇవే ఉంటాయని సమాచారం. ఉమ్మడి జిల్లాలో అధికారికంగా యాజమాన్యాలవారీగా నోటిఫైచేసే పోస్టులపై బుధవారం ఒక స్పష్టతవచ్చే అవకాశం ఉంది.
![]() |
![]() |